విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద బుధవారం తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యులు సందే గంగయ్య, రణదేవ్‌లతోపాటు మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులున్నారు. ఎదురుకాల్పుల నుంచి మరికొంతమంది మావోయిస్టు కీలక నేతలు తప్పించుకుని వుంటారనే ఉద్దేశంతో ప్రత్యేక పోలీసుల బలగాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.
ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ వ్యక్తిగత అంగరక్షకురాలు కూడా ఈ కాల్పుల్లో చనిపోయింది. అరుణ గాయపడి, ఘటనాస్థలినుంచి తప్పించుకొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పంచాయతీ తీగలమెట్ట సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్టు ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు తెలిపారు.
తీగలమెట్ట ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు సమావేశం నిర్వహించి గిరిజనులకు ఇబ్బందులు కలగచేస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీస్ బలగాలను పంపామని తెలిపారు. ఒడిశాలో ఎదురు కాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల్లో కొందరు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు.
విశాఖ జిల్లా కొయ్యూరు మండలంలో పెద్ద ఎత్తున సరుకులు కొనుగోలు చేసి అటవీ ప్రాంతంలోకి తరలిస్తుండటాన్ని గుర్తించారు. కూంబింగ్ చేపట్టిన గ్రేహౌండ్స్ బలగాలకు కొయ్యూరు మండలం తీగలమెట్ట ప్రాంతంలో గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు. ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గుంపుల గ్రామానికి చెందిన సందె గంగన్న అలియాస్ అశోక్ (39) ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. అశోక్ ఈస్టు డివిజన్ డీసీఎంగా పనిచేస్తున్నాడు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన అగ్ర మావోయిస్టు నేత సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్‌కు గంగన్న సమీప బంధువు.
7వ తరగతి వరకు చదివిన గంగన్నకు వెల్డర్‌గా గంగన్నకు మంచి అనుభవం ఉండడంతో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తమ వెంట దండకారణ్యం తీసుకెళ్లారు. అక్కడి అబూజ్‌మడ్‌లో ఏర్పాటు చేసిన ఆయుధాల తయారీ కేంద్రంలో సుదీర్ఘకాలం గంగన్న పనిచేశాడు. సల్వాజుడుం వ్యవస్థాపన నేత మహేంద్ర కర్మ హత్యకేసులో గంగన్న నిందితుడు. ఇప్పటివరకు 19 ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకుని.. చివరకు విశాఖ ఏజెన్సీలో పోలీసుల చేతుల్లో చనిపోయాడు.
ఇంకా మృతులలో ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కలిమెల బ్లాక్ టేక్‌గుడ గ్రామానికి చెందిన ఈస్టు డివిజన్ డీసీఎం రణదేవ్ అలియాస్ అర్జున్ (31), కొరాపుట్ జిల్లా భాలైపుట్టు గ్రామానికి చెందిన ఏసీఎం సంతు నాచిక (28), ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన దళ సభ్యురాలు పైకే (25), గూడెంకొత్తవీధి మండలం పేములగొంది గ్రామానికి చెందిన దళ సభ్యురాలు, ఈస్టు డివిజన్ కార్యదర్శి అరుణ వ్యక్తిగత గార్డు లలిత (28) ఉన్నారు.
మృతిచెందిన మరో మహిళా సభ్యురాలిని గుర్తించాల్సి ఉంది. సంఘటనా స్థలంలో ఒక ఏకే 47, మరో ఎస్‌ఎల్‌ఆర్, ఒక కార్బన్ రైఫిల్, మూడు 303 తుపాకులు, ఒక తపంచాతోపాటు వంట సామగ్రి, మందులు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల నుంచి ఈస్టు డివిజన్ కార్యదర్శి అరుణ, గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి జగన్ తప్పించుకున్నారన్న సమాచారంలో పోలీసు బలగాలు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. ఏవోబీ సరిహద్దు ప్రాంతాలకు అదనపు బలగాలను పంపించినట్టు తెలిసింది.
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతంలో వరుస ఎదురుకాల్పులతో క్యాడర్‌ని కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 40 మంది మావోయిస్టులు మృత్యువాతపడ్డారు.
ముఖ్యంగా ఈస్టు డివిజన్‌కి ఆయువుపట్టుగా వున్న గాలికొండ ఏరియా కమిటీ…ఎదురుకాల్పులు, లొంగుబాట్లతో బలహీనపడింది. 2017 అక్టోబరులో ఒడిశా సరిహద్దులోని రామ్‌గఢ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 30 మందికిపైగా మావోయిస్టులు మృతిచెందారు. ముఖ్యంగా ఏవోబీపై పట్టున్న అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు.
More Stories
బాంగ్లాలో హిందువులపై మారణకాండ పట్ల భారత్ చర్యలు చేపట్టాలి
భగవద్గీతలోని సర్వకాలీన విజ్ఞానం
అమెరికా చదువులపై భారత విద్యార్థుల అనాసక్తి