
మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్‌కు భారత్ లో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. కొత్త ఐటీ నిబంధనలకు లోబడని కారణంగా కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్ ప్రకారం కొందరు కీలక అధికారులను ట్విటర్ నియమించాల్సి ఉన్నా ఆ సంస్థ ఆ పని చేయడంలో విఫలమైన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఆ వెంటనే ఉత్తర ప్రదేశ్‌లో ట్విటర్‌పై తొలి కేసు కూడా నమోదవడం గమనార్హం. మతపరమైన హింసను ప్రోత్సహించే ట్వీట్ల కారణంగా ఆ సంస్థపై ఈ కేసు పెట్టారు. మే 26నే కొత్త ఐటీ చట్టాలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ట్విటర్‌కు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
అందుకే సోషల్ మీడియా మధ్యవర్తిగా ఉండాల్సిన చట్టపరమైన రక్షణను ట్విటర్ కోల్పోయిందని, ఇక నుంచి ఇతర పబ్లిషర్లలాగే భారత చట్టాల పరంగా చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ వెంటనే యూపీలో థర్డ్ పార్టీ కంటెంట్ కలిగి ఉన్నదంటూ ట్విటర్‌పై కేసు నమోదైంది.
“స్వేచ్ఛను కాపాడే వేదికగా చిత్రీకరించుకొనే చిత్రీకరించే ట్విట్టర్, మధ్యవర్తిత్వ మార్గదర్శకాల విషయానికి వస్తే ఉద్దేశపూర్వకంగా ధిక్కరించే మార్గాన్ని ఎంచుకుంటుంది” అని ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో ఆరోపించారు.
సోషల్ మీడియా మధ్యవర్తులకు మంజూరు చేసిన ట్విట్టర్ తన ‘సేఫ్ హార్బర్’ను కోల్పోయే అవకాశం ఉందని హైలైట్ చేసిన నివేదికల తర్వాత ప్రసాద్ ఈ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో తెలియజేయబడిన కొత్త ఐటి రూల్స్ 2021 ను పాటించటానికి నిరాకరించడంపై ప్రసాద్ ట్విట్టర్‌ను ఆయన ప్రశ్నించారు.
ఈ నెల 5న ఓ ముస్లిం వ్యక్తిపై దాడికి సంబంధించి ఈ కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ట్విటర్ తొలగించలేదని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు వెల్లడించారు. ఈ ట్వీట్లను తొలగించాలని చెప్పినా ట్విటర్ వినలేదని, ఇక ఇండియాలో ఆ సంస్థకు చట్టపరమైన రక్షణ లేకపోవడం, ఆ వీడియోను తప్పుదోవ పట్టించే మీడియాగా గుర్తించకపోవడం వల్ల ఈ కేసు నమోదు చేసినట్లు ప్రభుత్వవ వర్గాలు చెప్పాయి.
భారత్ లోని ప్రధాన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ట్విటర్ మాత్రమే కొత్త ఐటీ చట్టాలకు కట్టుబడలేదని, చీఫ్ కాంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించలేదని తెలిపాయి. అయితే తాము తాత్కాలిక కాంప్లయెన్స్ ఆఫీసర్‌ను నియమించామని, ఈ వివరాలను ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకుంటామని మంగళవారం ట్విటర్ తెలిపింది.
More Stories
ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి
నకిలీ ఆధార్ కార్డుల తయారీలో బెంగాల్ లో నలుగురు అరెస్ట్
29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు