‘రిపేర్, ప్రిపేర్’ నినాదంతో కదులుదాం

మనమంతా ఇక ‘రిపేర్, ప్రిపేర్’ నినాదంతో ముందుకు వెళ్లాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. అత్యంత నష్టదాయక మహమ్మారి కరోనా విపత్తు నుంచి క్రమేపీ జాతి బయటపడుతోందని, ఈ దశలో తిరిగి ఆర్థికంగా, ఉద్యోగ ఉపాధిపరంగా పుంజుకునేందుకు సమాయత్తం కావల్సి ఉందని చెప్పారు.

వ్యవస్థల మరమ్మతు, సంసిద్థత దిశలో ముందుకు వెళ్లాల్సి ఉందని ప్రధాని తెలిపారు. వివాటెక్ సమ్మిట్‌లో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం వెలువరిస్తూ ఓ ఏడాదిగా వివిధ రంగాలలో విచ్ఛిన్నకర పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.  పరిస్థితి చేష్టలుడిగిపోయినట్లుగానే ఉందని, అయితే ఇటువంటి ఆటంకాలు, విచ్ఛిత్తి ప్రక్రియలతో నిరాశానిస్పృహలకు గురికావల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. 

ఇప్పుడిప్పుడే కొవిడ్ నుంచి కోలుకుంటున్న ఆశారేఖలు దేశవ్యాప్తంగా విస్తరించుకుంటున్నాయని చెప్పారు. ఈ దశలో మనను మనం మునుపటి స్థితికి వెళ్లేందుకు సిద్ధం చేసుకోవల్సి ఉందని అంటూ రిపేర్ ప్రిపేర్ పద్థతిని పాటించాలని సూచించారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని,  జరగాల్సిన నిర్మాణాన్ని సంతరించుకుని తీరాలని ప్రధాని పిలుపు నిచ్చారు. 

దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకోవాల్సి ఉందని, ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థ తిరిగి పట్టాలెక్కాల్సి ఉందని ప్రధాని తెలిపారు. దశాబ్దాలలో ఎప్పుడూ లేని విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయిలో కుంచించుకు పోయిందని గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంతో తేలిన లెక్కలు ఈ దుస్థితిని తెలియచేస్తున్నాయని చెప్పారు.

కరోనా కట్టడికి అనివార్యం అయిన లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాల చట్రం అస్తవ్యవస్థం అయిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం ఒక్కటే కాదు ప్రపంచం అంతా కూడా కరోనా నుంచి కోలుకొంటోందని చెబుతూ ఈ దశలో భారత్ లో  ప్రభుత్వం అన్ని స్థాయిలలో భారీ సంస్కరణలను తీసుకువచ్చిందని, అన్ని రంగాల మౌలిక సమస్యలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని వీటిపై దృష్టి సారించడం జరిగిందని తెలిపారు.

మైనింగ్ మొదలుకుని అంతరిక్షం వరకూ, బ్యాంకింగ్ నుంచి ఆటామిక్ ఎనర్జీ వరకూ కీలక సంస్కరణలు ఆరంభం అయ్యాయని తెలిపారు. తీవ్రసవాళ్ల నేపథ్యంతో ఇటువంటి భారీ ప్రక్షాళనాత్మక చర్యలు సాహసోపేతం అవుతాయని పేర్కొన్నారు. సవాళ్లకు తగు జవాబు ఇవ్వడం, ఒడుదుడుకులకు తట్టుకుని నిలవడం, తిరిగి పుంజుకోవడం వంటి కీలక లక్షణాలను భారత దేశం ఓ గణనీయ దేశంగా ఇప్పుడు చాటుకుందని తెలిపారు.

పెట్టుబడిదార్లు, సరికొత్త ఆవిష్కర్తలు కోరుకున్న వాటిని దేశం అందిస్తుంది. ప్రపంచ దేశాల నుంచి ఇండియాకు భారీ స్థాయిలో పెట్టుబడులు రావాలని ఆహ్వానిస్తున్నామని ప్రధాని చెప్పారు. ఐదు పునాదులు ప్రతిభ, మార్కెట్, క్యాపిటల్, ఎకో సిస్టమ్, కల్చర్, పారదర్శకతల మీద ఇప్పటి విధానాలు నెలకొన్నాయనే విషయాన్ని గుర్తించాలని తెలిపారు. 

టెక్నాలజీ, స్టార్టప్‌ల రంగంలో ప్రపంచస్థాయిలో భారతదేశపు విజయాల గురించి విదితమైన వాస్తవాలు అందరికి తెలిసినవే అన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ ఉన్న దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఇప్పటి సదస్సును నిర్వహించిన వివాటెక్ ప్రపంచస్థాయిలో స్టార్టప్‌ల ఏర్పాటులో, సృజనాత్మక ఆవిష్కరణల దిశలో కీలకంగా పనిచేస్తున్న సంస్థగా ఉంది. ప్రపంచస్థాయి ప్రతిభావంత మేథస్సులకు, ప్రతిభకు, ఉత్పత్తులకు సరైన ప్రోత్సాహం కల్పిస్తూ వస్తోందని వివరించారు.