పేద దేశాలకు జి 7 దేశాలు బిలియన్ కరోనా టీకా డోసులు

పేద దేశాలకు జి 7 దేశాలు బిలియన్ కరోనా టీకా డోసులు

పేద దేశాలకు బిలియన్ కరోనా టీకా డోసులను ఇవ్వాలని జీ7 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. ఇంగ్లండ్‌లో మూడు రోజులపాటు జరిగిన జీ7 నేతల సదస్సు జాన్సన్ మాట్లాడుతూ.. టీకాలను నేరుగా, అంతర్జాతీయ కొవాక్స్ కార్యక్రమం ద్వారా రెండు విధాలుగానూ అందించనున్నట్టు చెప్పారు.

ప్రపంచానికి చైనా కరోనా వైర్‌సను అందిస్తే.. జీ7 దేశాలు వ్యాక్సిన్‌ ఇవ్వాలని తీర్మానించిన్నట్లు వెల్లడించారు. కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే 2022 మధ్య నాటికి  ప్రపంచ జనాభాలోని 70 శాతం మందికి టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇందుకోసం 11 బిలియన్ టీకా డోసులు అవసరమవుతాయని చెప్పింది. అయితే, ఇప్పుడు జీ7 దేశాలు మాత్రం బిలియన్ టీకాలు మాత్రమే అందిస్తామని చెప్పడం గమనార్హం.

బ్రిటన్ ప్రధాని జాన్సన్ పేర్కొన్న బిలియన్ టీకా డోసుల్లో సగం అమెరికా ఇవ్వనుండగా, 100 మిలియన్ డోసులను బ్రిటన్ ఇవ్వనుంది. జీ7 దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా ఉన్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా టీకాలు వేయడం, భారీ సంస్థలు తమ పన్నులను చెల్లించేలా చేయడం, సాంకేతికత, డబ్బు సాయంతో వాతావరణ మార్పులను పరిష్కరించడం వంటి లక్ష్యాలను పెట్టుకున్న జీ7 నేతలు.. తమ తొలి శిఖారాగ్ర సమావేశాన్ని రెండేళ్లలో ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక, చివరి రోజు సమావేశంలో వాతావరణ మార్పులపై చర్చించారు. పేద దేశాల్లో కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కొత్త ఫైనాన్సింగ్ చర్యలను ప్రకటించాలని భావిస్తున్నారు. అయితే, ఈ సమస్యను పరిష్కరించాలంటే 100 బిలియన్ డాలర్ల వార్షిక నిధి అవసరమని వాతావరణ కార్యకర్తలు, నిపుణులు చెబుతున్నారు. 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను సున్నాకు తగ్గించాలని జీ7 దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.  

కాగా, అధికార కాంక్షతో, ప్రపంచ నాయకత్వానికి తహతహలాడుతున్న చైనాకు చెక్‌ పెట్టాల్సిందేనని జీ7 దేశాల అధినేతలు తీర్మానించారు. కరోనా వైరస్‌ వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందనే అంశంపైనా సుదీర్ఘం గా చర్చలు జరిపారు. కరోనా మూలాలను శోధించాల్సిందేనని నిర్ణయించారు. 

సామ్రాజ్య కాంక్షతో ముం దుకు పోతున్న చైనా మార్కెటేతర ఆర్థిక విధానాలను తీవ్రం గా వ్యతిరేకించారు. ఈ విధానంలో నిజాయితీ, పారదర్శకత లోపిస్తున్నాయని దుయ్యబట్టారు. చైనాలో హక్కుల ఖననాన్ని ఖండించారు. 

జిన్‌జియాంగ్‌లో వుయ్‌ఘర్‌ ముస్లింలపై జరుగుతున్న హింసాకాండపైనా స్పందించారు. ఆ ప్రాంతంలో స్వేచ్ఛకు కృషి చేయాలని నిర్ణయించారు. స్వయం ప్రతిపత్తిగల హాంకాంగ్‌ నగరంపైనా చైనా పెత్తనాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.