కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడానికి ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్.. వన్ హెల్త్)’ అనే సమష్టి భావనతో ప్రపంచం ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ7 సదస్సులో ‘‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్’’ పేరిట నిర్వహించిన చర్చాగోష్టిలో శనివారం మోదీ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని, ప్రపంచస్థాయి నాయకత్వం, సంఘీభావం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రజాస్వామ్య దేశాలు, పారదర్శక సమాజాలపై ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని తెలిపారు.
వ్యాక్సిన్లపై తాత్కాలికంగా మేధో హక్కులను (పేటెంట్లను) రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్, దక్షిణాఫ్రికాలు ఉమ్మడిగా చేసిన ప్రతిపాదనకు మద్దతుగా నిలవాలని మోదీ జీ7 దేశాధినేతలను కోరారు. కొవిడ్ మహమ్మారిపై పోరులో కీలకమైన టీకాల విషయంలో ఆటంకాలొద్దని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజల భాగస్వామ్యంతో తాము కొవిడ్‌ను ఎదుర్కొంటున్నామని ప్రధాని తెలిపారురు. ‘‘భారత్ అందిపుచ్చుకున్న డిజిటల్ టెక్నాలజీతో మహమ్మారిని సమర్థంగా అడ్డుకుంటున్నాం. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్.. వ్యాక్సినేషన్‌కు డిజిటల్ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో భారత్ గడించిన అనుభవాన్ని, నైపుణ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని భావిస్తున్నాం’’ అని చెప్పారు.
ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో సమష్టి కృషికి భారత్ కట్టుబడి ఉంటుందని మోదీ చెప్పారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్, వన్ హెల్త్) అనేది అందరి మంత్రం కావాలని, జీ7 సమావేశం ఈ సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. జీ7లో యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి.
మోదీ అభిప్రాయానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి గట్టి మద్దతు లభించింది. ప్రధాని ప్రతిపాదించిన వన్ ఎర్త్ వన్ హెల్త్‌కు ఆమె అండగా నిలిచారు. ప్రధాని మోదీతో పలు అంశాలపై తాను జరిపిన చర్చలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గుర్తు చేసుకున్నారు. భారత్ వంటి భారీ వ్యాక్సిన్ ఉత్పత్తిదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ముడిపదార్ధాలు సరఫరా చేయాలని ఫ్రాన్స్ అధినేత మాక్రాన్ సూచించారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు జీ7దేశాలు అందించిన సాయానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.
ఆదివారం సైతం జీ7 సదస్సులో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ప్రసంగించనున్నారు. నిజానికి ఆయన ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్ వెళ్లా ల్సి ఉన్నా.. భారత్‌లో సెకండ్‌వేవ్ ఉధృతి వల్ల రాలేనని జీ-7కు తెలిపారు. దాంతో ఇంగ్లండ్ ప్రధాని బోరీజాన్సన్ వర్చువల్‌గా పాల్గొనాల్సిందిగా కోరారు.
More Stories
`సర్వ స్పర్శి, సర్వవ్యాపి’గా ఆర్ఎస్ఎస్ అన్ని అంశాల స్పృశి
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లపాటు వాయిదా