వెంటిలేటర్‌పై ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవహారాలు!

వెంటిలేటర్‌పై ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవహారాలు!
ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక వ్యవహారాలు ప్రస్తుతం వెంటిలేటర్‌పై కొనసాగుతున్నాయి. ప్రతి నెలా రూ.6వేల కోట్ల నుంచి 7 వేల కోట్ల రెవెన్యూ లోటు పోటెత్తుతోంది. ఈ దుస్థితిని ముందుగానే పసిగట్టిన ఆర్థిక శాఖ ఈ ఏడాది ఏకంగా రూ.70వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది.
 
కానీ కేంద్రం మొదటి తొమ్మిది నెలలకు రూ.20వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు మాత్రమే అనుమతించింది. అందులో, మొదటి పది వారాల్లోనే రూ.12,000 కోట్లు వాడేశారు. మిగిలిన రూ.8,000 కోట్లు జూలై ఆఖరు వరకు వాడేస్తారు. ఆ తర్వాత రాష్ట్రం నడిచేదెలా? ప్రతి నెలా రూ.6,000 కోట్లకుపైగా లోటు పూడ్చేదెలా? 
 
కేంద్రం తదుపరి అప్పులకు అనుమతి ఇవ్వకుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి? అన్నది ప్రభుత్వానికి పెను సమస్యగా మారింది. అందుకనే   ప్రభుత్వ ఆస్తుల తనఖా చేపట్టారు. కానీ, ఆ తనఖాలతో ఎన్ని నెలలు నడపగలరు? ఎంత అప్పు తేగలరు?  అన్నది ప్రశ్నార్ధకరం. 
 
కేంద్రం నుంచి ఎలాగైనా మరో రూ.50,000 కోట్ల అప్పుకు అనుమతి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో శతవిధాలుగా ప్రయత్నిస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా, రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర ప్రభుత్వ పథకాల కింద వచ్చే సొమ్ములు  ఇలా అన్ని రకాల మార్గాల్లో వచ్చే ఆదాయం  నెలకు రూ.10వేల కోట్లు. 
 
ఇందులో అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులకు నెలకు రూ.4,000 కోట్లు, విద్యుత్‌ బాండ్లకు రూ.500 కోట్లు, సామాజిక పెన్షన్లకు రూ.1,400 కోట్లు, ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు రూ.5,000 కోట్లు ఖర్చవుతోంది. వీటికి కూడా రాష్ట్ర ఆదాయం సరిపోవడం లేదు. ఇవి కాకుండా నవరత్నాల్లో పథకాలకు ప్రతి నెలా సగటున రూ.5,800 కోట్లు ఖర్చవుతోంది.
 
అంటే నెలకు సగటున రూ.6,000 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల లోటు ఇక్కడే కనిపిస్తోంది. సరఫరాదారులు, విక్రేతలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఉంటేనే లోటు ఇంత భారీగా ఉందనేది వాస్తవం. ఇవి కాకుండా ప్రతి నెలా అప్పు లేనిదే రాష్ట్ర సచివాలయం మొదలుకొని గ్రామ సచివాలయం వరకు ఏ కార్యాలయాన్నీ నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. 

గత ఏడాది అప్పుల అసలు, వడ్డీ కింద రూ.35,000 కోట్లు చెల్లించారు. ఈ ఏడాది అది రూ.48,000 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా. గత ఏడాది నెలకు రూ.2,916 కోట్లు అసలు, వడ్డీ చెల్లింపులు ఉంటే,  ఈ ఏడాది అవి నెలకు రూ.4,000 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కార్పొరేషన్ల అప్పులు, వడ్డీలు కూడా ఉన్నాయి. అంటే రాష్ట్రానికి మిగిలేది రూ.6,500 కోట్లు మాత్రమే.

కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రానికి నెలకు రూ.1,000 కోట్ల నుంచి రూ.1,300 కోట్లు వస్తున్నాయి. కానీ, వీటిని ఆ పథకాలకు చెల్లించకుండా రాష్ట్ర అవసరాలకు మళ్లిస్తున్నారు.

రాష్ట్రం కేంద్ర పథకాలకు తన వాటా నిధులు చెల్లించడం లేదని గ్రహించిన కేంద్రం ఒక్కో పథకానికి ఒక్కో ఖాతా తెరవాలని ఆదేశించింది. అయినా ఆర్థిక శాఖ ఆ పని చేయడం లేదు. గ్రీన్‌చానల్‌ పేరుతో ఒకే పీడీ ఖాతా తెరిచి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను రాష్ట్రానికి సంబంధించిన ఇతర అవసరాలకు మళ్లిస్తోంది.