బంగాళాఖాతంలో విస్తరించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు వాయువ్య బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరించి,  ఆంధ్ర ప్రదేశ్ తో పాటు జార్ఖండ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఒడిశాల్లోనూ ఇవి ముందుకు కదులుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాలకు నైరుతి విస్తరించనుంది. దీంతో, ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 
 
అల్పపీడనం బలపడనుండడంతో వర్షాలు మెండుగా పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం, దాని పక్కనే ఉన్న ఒడిశా, పశ్చిమబెంగాల్‌ గాంగ్‌టక్‌ తీరాలపైగల అల్పపీడన ప్రాంతం శనివారం నాటికి వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా పరిసరాల వైపు విస్తరించింది.
 
ఆంధ్ర ప్రదేశ్ లో తొమ్మిది చోట్ల అడపాదడపా వర్షాలు కురిశాయి. అత్యధికంగా నందిగామలో 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడలో 8.8 మిల్లీమీటర్లు, విశాఖపట్నం, నర్సాపూర్‌ల్లో 1.6 మిల్లీమీటర్ల చొప్పున, మచిలీపట్నంలో ఒక మిల్లీమీటరు, కళింగపట్నం, అమరావతిలో 0.2 మిల్లీమీటర్ల చొప్పున, తునిలో 0.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 
 
రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురవడానికి అవకాశాలున్నాయి. ఉత్తర కోస్తాల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుముఖం పట్టాయి. కావలిలో అత్యధికంగా 37.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, అత్యల్పంగా నందిగామలో 22.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.