ఉత్తర ప్రదేశ్ విభజన ఆలోచనలే లేవు!

వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ప్రయోజనం ఆపండడం కోసం రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విభజించి, ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం, బిజెపి సన్నాహాలు చేస్తున్నట్లుగా రెండు, మూడు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొట్టిపారవేసింది. 
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజులపాటు జరిపిన ఢిల్లీ పర్యటనలు ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాలతో జరిపిన భేటీలలో ఈ అంశమే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని సహితం త్రోసిపుచ్చింది.
ఉత్తర ప్రదేశ్‌ను విభజించి, మూడు ప్రత్యేక రాష్ట్రాలుగా చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై రాష్ట్రంలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పందిస్తూ అలాంటి నిర్ణయం ఏదీ ఇంత వరకు జరగలేదని స్పష్టం చేసింది.  దీనిపై వస్తున్న వదంతులన్నీ నిరాధారపూరతమైనవేననీ,  రాష్ట్ర విభజన కోసం ఇంత వరకు ఎలాంటి ప్రతిపాదనలూ సిద్ధంకాలేదని ప్రభుత్వం పేర్కొంది. 
రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ వెళ్లిన దగ్గర్నుంచి దేశంలోని అత్యధిక జనాభా కలిగిన యూపీని విభజిస్తున్నారంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యూపీని మూడు రాష్ట్రాలుగా విభజించనున్నట్టు మీడియాలోని ఓ వర్గం విస్తృతంగా ప్రచారం చేసింది.
పశ్చిమాన జిల్లాలన్నీ కలిపి హరిత ప్రదేశ్‌గా, ఏడు జిల్లాలను బుందేల్‌ఖండ్‌గా విభజించి, మిగతా జిల్లాలను ఉత్తర ప్రదేశ్‌గా కొనసాగించనున్నట్టు వార్తలు వచ్చాయి. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఇప్పటికే బీజేపీ పలు వేదికలపై ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో దీనిపై వివరణ ఇస్తూ యూపీ సమాచార శాఖ ప్రకటన విడుదల చేసింది.

అలాంటి వార్తలన్నీ నిరాధారమైనవనీ, రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని స్పష్టం చేసింది. ‘‘రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలన్నీ ఫేక్. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు” అని యూపీ కేబినెట్ మంత్రి, అధికార ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ సహితం స్పష్టం చేసారు.

గతంలో మాయావతి ప్రభుత్వం రాష్ట్రాన్ని నాలుగుగా విభజించాలని ప్రతిపాదించింది. ఆ మేరకు 2011 నవంబర్ 21న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ ప్రతిపాదనను అప్పట్లోనే బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. గత జనవరిలో సహితం ఇటువంటి ఊహాగానాలు వెలువడినప్పుడు, “మా ప్రభుత్వం సమైక్యంగా ఉంచడం పట్ల విశ్వసిస్తుంది. విభజన పట్ల మాకు విశ్వాసం లేదు” అని  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత జనవరిలో స్పష్టం చేయడం గమనార్హం.