ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చలకు తిరస్కరించిన హెజ్జుల్లా

ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చలకు తిరస్కరించిన హెజ్జుల్లా

లెబనాన్‌‌పై ఇజ్రాయిల్‌ ‌భీకర దాడులు కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయిల్‌ మూడు వారాలు కాల్పుల విరమణ పాటిస్తుందని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రకటించారు. అయితే ట్రంప్‌ ‌ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయిల్‌ లెబనాన్‌‌పై దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో లెబనాన్‌ ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చలకు ‌సన్నద్ధమవుతోంది. 

అయితే, ఇజ్రాయిల్‌‌తో లెబనాన్‌ ‌ప్రత్యక్ష చర్చలు చేస్తే అవి లెబనాన్‌‌నే అస్థిరపరుస్తాయని ‌సోమవారం హెజ్బుల్లా నాయకుడు నజీమ్‌ ‌ఖాసిమ్‌ హెచ్చరించారు. ఇజ్రాయిల్‌‌తో లెబనాన్‌ జరిపే చర్చలను ఆయన తిరస్కరించారు. ‌లెబనాన్‌ అధికార పక్షం చర్చల పేరిట ఘోర పాపానికి పాల్పడుతుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

“మేము ఇజ్రాయెల్‌తో ప్రత్యక్ష చర్చలను ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాము. అధికారంలో ఉన్నవారు తమ చర్యల వల్ల లెబనాన్‌కు గానీ, తమకు గానీ ప్రయోజనం చేకూరదని తెలుసుకోవాలి” అని ఖాసిమ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లెబనాన్‌ను అస్థిరత సుడిగుండంలోకి నెడుతున్న తమ ఘోర పాపం నుండి వెనక్కి తగ్గాలని ఆయన అధికారులకు పిలుపునిచ్చారు.

“ఇజ్రాయిల్‌‌తో ప్రత్యక్ష చర్చల వల్ల లెబనాన్‌‌కు ఫలితాలు లేనట్లే ఉన్నాయి. ఈ చర్చలతో మాకెలాంటి సంబంధం లేదు. లెబనాన్, ఆ దేశ దాని ప్రజల కోసం మేము మా రక్షణాత్మక ప్రతిఘటనను కొనసాగిస్తాము” అని నజీమ్‌ ‌ఖాసిమ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. “శత్రువు ఎంత బెదిరించినా మేము వెనకడుగు వేయము. తలవంచము, ఓటమిని అంగీకరించము” అని ఆయన ఇజ్రాయిల్‌ చర్యలపై ధీటుగా స్పందించారు.

గత కొన్ని వారాల్లో, లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల అమెరికా రాయబారులు వాషింగ్టన్‌లో రెండు సమావేశాలు నిర్వహించారు; దశాబ్దాల కాలంలో ఇటువంటి సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశాల్లో మొదటిది ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధంలో కాల్పుల విరమణకు దారితీయగా, ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకునే లక్ష్యంతో బీరుట్ ప్రత్యక్ష చర్చలకు సన్నద్ధమవుతోంది. ఈ రెండు దేశాలు 1948 నుండి అధికారికంగా యుద్ధ స్థితిలోనే కొనసాగుతున్నాయి.