ప్రస్తుతం యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం పరిణమిస్తోందని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాద చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) రక్షణ మంత్రుల స్థాయి సమావేశం ఖండించిందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు ఎస్‌సీఓ కూటమి కట్టుబడి ఉందని మంగళవారం కిర్గిజ్‌స్తాన్‌లోని బిష్కెక్ నగరంలో ఎస్‌సీఓ సభ్యదేశాల రక్షణ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలో ఏకపక్ష పోకడలు, సైనిక ఘర్షణలు పెరుగుతుండటం పట్ల రాజ్‌నాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లలో ఈ ఘర్షణల్లో ఎంతోమంది విలువైన ప్రాణాలను కోల్పోయారని గుర్తుచేశారు. భారీ ఆస్తి నష్టాలతో పాటు బాధాకర ఘట్టాలను ప్రపంచం చూడాల్సి వచ్చిందని రక్షణమంత్రి చెప్పారు. ఈ అంతర్జాతీయ పరిణామాలపై ఎస్‌సీఓ దేశాల రక్షణ మంత్రులు సమీక్షించి, భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపిచ్చారు.
ఉమ్మడి సవాళ్లను పరిష్కరించుకునే క్రమంలో ఎస్‌సీఓ సభ్యదేశాలు పరస్పర సమానత్వం, గౌరవం, సహకారం, విశ్వాసంతో మెలగాలని రాజ్‌నాథ్ కోరారు. ఉగ్రవాద కేంద్రాలు ఇకపై సమంజసమైన శిక్ష నుంచి మినహాయింపును పొందలేవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. సరిగ్గా ఏడాది క్రితం (2025 ఏప్రిల్ 22న) భారత్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆ పాశవిక దాడిలో చనిపోయిన వారికి ఏప్రిల్ 22నే తాము నివాళులు అర్పించామని చెప్పారు. ఆ ఉగ్రదాడి యావత్ ఆసియా ప్రాంతంతో పాటు సర్వ మానవాళిని కలచివేసిందని చెబుతూ పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిందని, వాటిని వదిలేది లేదనే సందేశాన్ని ఇచ్చిందని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిచ్చే వారిని, ప్రేరేపించే వారిని భారత్ వదలదని హెచ్చరించారు.
“2025లో చైనా వేదికగా ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా టియాంజిన్ తీర్మానాన్ని ఆమోదించారు. అందులోనూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎస్‌సీఓ కూటమి దేశాలు స్పష్టమైన వైఖరిని తీసుకున్నాయి. ఉగ్రవాదానికి జాతీయత కానీ, మతం కానీ ఉండవని మనం గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదానికి ఊతమిచ్చే, మానవతాపరమైన నష్టానికి కారణమయ్యే ఏ ఒక్క అవకాశాన్నీ ఎస్‌సీఓ దేశాలు ఇవ్వకూడదు” అని స్పష్టం చేశారు.
ఉగ్రవాదంపై పోరు విషయంలో ఎస్‌సీఓ సభ్యదేశాలు ద్వంద్వ వైఖరిని విడనాడాలని రక్షణ మంత్రి హితవు చెప్పారు. ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని ఇచ్చే దేశాల విషయంలో ఏ ఒక్క సభ్యదేశమూ ద్వంద్వ వైఖరిని కలిగి ఉండటం సరికాదని తెలిపారు. మరొక సార్వభౌమ దేశంపై దాడిచేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను చూసీచూడనట్టుగా వదిలేయకూడదని స్పష్టం చేశారు.
అలాంటి దేశాలపై తగిన చర్యలు తీసుకునేందుకు ఎస్‌సీఓ అస్సలు వెనక్కి తగ్గకూడదని పేర్కొంటూ ఉగ్రవాదంపై పోరు విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పక్కాగా అమలు చేసే వేదికగా ఎస్‌సీఓ నిలవాలని రాజ్‌నాథ్ తెలిపారు. ప్రపంచ దేశాలు ఈ కాలాన్ని హింస, యుద్ధాల యుగంగా కాకుండా శాంతి, శ్రేయస్సుల యుగంగా మార్చాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.
కంటికి కన్ను అనే సిద్ధాంతం అందరినీ గుడ్డివాళ్లుగా చేస్తుందన్న జాతిపిత మహాత్మా గాంధీ సందేశాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రపంచ దేశాలు ప్రతీ పనిని చేసే ముందు ఆ చర్య ఒక పేద, నిరుపేద వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకురాగలదో ఆలోచించాలని సూచించారు. ఎస్‌సీఓ కూటమి దేశాలు ప్రపంచ జనాభాలో ఒక ప్రధానమైన విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మన ప్రాంతంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి, సుస్థిరతలకు చేయూతను అందించాలన్నారు. దేశాలు నిరంతరం బలప్రయోగ మార్గాన్ని కాకుండా సంప్రదింపులు, దౌత్య మార్గాన్ని అనుసరించాలని రాజ్‌నాథ్ కోరారు.

More Stories
డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్
బెంగాల్లో ఉధృతంగా ముగిసిన ఎన్నికల ప్రచారం.. రేపే పోలింగ్
ఏఐతో సంక్లిష్ట వైరస్‌లను సృష్టించగల మిథోస్ ముప్పు!