డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ల ముప్పును ఎదుర్కొనేందుకు టెలికాం నియంత్రణ సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్బీఐ, టెక్ సంస్థలు, సీబీఐ సహకారంతో పలు చర్యలు చేపట్టినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇందులో భాగంగా డిజిటల్ అరెస్టు మోసాలకు, నేరాలకు పాల్పడుతున్న 9,400 వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్లు వెల్లడించింది. వాస్తవానికి దేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్టు కేసులను అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 9న ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్టినేషన్ సెంటర్ (14సీ) ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం డిజిటల్ అరెస్టులతో సహా ఆన్లైన్ మోసాలపై సుమోటోగా విచారణ చేపట్టింది. డిజిటల్ అరెస్టు కేసుల్లో నష్టపోయిన వారికి తగు పరిహారం అందించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని, ఇందుకోసం ఆర్బీఐ, టెలికమ్యునికేషన్ విభాగం, ఇతర సంస్థలను సంయుక్తంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి ప్రభుత్వం తరఫున తాజా నివేదికను సుప్రీం కోర్టు ముందు దాఖలు చేశారు. ఇందులో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు వాట్సాప్‌పై తీసుకున్న చర్యలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, డీవోటీ ఆదేశాల మేరకు, వాట్సాప్ డిజిటల్ అరెస్టు స్కామ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు.
“ఈ స్కామ్‌లపై అత్యంత కఠినమైన పద్ధతులను ఉపయోగించి దర్యాప్తు నిర్వహించింది. ముందుగా ‘సీడ్ సిగ్నల్స్ గుర్తించడం > నెట్‌వర్క్‌లను మ్యాప్ చేయడం > మొత్తం నెట్‌వర్క్‌పై చర్యలు తీసుకోవడం > ఆటోమేటెడ్ డిఫెన్స్ నిర్మించడం’ లాంటి చర్యలు తీసుకుంది. దీని ద్వారా డిజిటల్ అరెస్టులతో ప్రమేయం ఉన్న 9400 ఖాతాలను బ్యాన్ చేసింది” అని ఆ నివేదికలో పేర్కొన్నారు.
“వినియోగదారుల రక్షణ కోసం వాట్సాప్ పలు ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్చర్లలో అధికారిక పోలీసు లేదా ప్రభుత్వ చిహ్నాలను ఉపయోగిస్తున్న ఖాతాలను తొలగించే లోగో డిటెక్షన్ వ్యవస్థలు తీసుకొచ్చింది. కొత్తగా క్రియేట్ చేసిన వాట్సాప్ అకౌంట్ల నుంచి కాల్ వస్తే, యూజర్లను హెచ్చరించే ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుంది” అని వివరించారు.
అలాగే అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వారి ప్రొఫైల్ ఫొటోలు కనిపించకుండా ఆటోమేటిక్‌గా హైడ్ చేసే ప్రక్రియను త్వరలో ప్రవేశపెట్టనుంది. అలాగే ఫోన్లో కేవైసీ పూర్తయిన సిమ్ కార్డు ఉంటేనే వాట్సాప్ పనిచేసేలా “సిమ్ బైండింగ్” విధానాన్ని 4 నుంచి 6 నెలల్లో అమలు చేస్తామని వాట్సాప్ తెలిపింది. ఇక అనుమానాస్పద, మోసపూరిత సిమ్ కార్డులను గుర్తించిన 2 నుంచి 3 గంటల్లోనే వాటిని బ్లాక్ చేసేలా చేయడానికి కట్టుబడి ఉన్నట్లు డీవోటీ పేర్కొంది.
సిమ్ కార్డుల జారీలో పారదర్శకత కోసం ‘బయోమెట్రిక్ ఐడెంటిటీ వెరిఫికేషన్ సిస్టమ్’ను 2026 డిసెంబర్ నాటికి అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రూ.10 కోట్లకు పైగా నష్టం వాటిల్లిన డిజిటల్ అరెస్టు కేసులను సీబీఐ నేరుగా విచారణకు స్వీకరించనుంది. ప్రస్తుతం గుజరాత్, దిల్లీకి చెందిన 3 ప్రధాన కేసులను సీబీఐ రీ-రిజిస్టర్ చేసింది. ఇందులో దిల్లీకి చెందిన ఓ బాధితుడు ఏకంగా రూ.22.92 కోట్లు కోల్పోవడం గమనార్హం.

More Stories
యావత్ ప్రపంచానికి ప్రధాన ముప్పుగా ఉగ్రవాదం
బెంగాల్లో ఉధృతంగా ముగిసిన ఎన్నికల ప్రచారం.. రేపే పోలింగ్
ఏఐతో సంక్లిష్ట వైరస్‌లను సృష్టించగల మిథోస్ ముప్పు!