పెరిగిన విమాన ఇంధన ధరలతో విమానాలను నడపడం కష్టంగా మారిందంటూ విమానయాన సంస్థలు ప్రభుత్వానికి మూకుమ్మడిగా మొర పెట్టుకున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఆదుకోకపోతే విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా మూసివేయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఎయిరిండియా, ఇండిగో, స్పైస్‌జెట్ సంస్థలతో ఏర్పాటైన ది ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్‌లైన్స్ (ఏఐఏ) పౌర విమానయాన శాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ రాసింది.
తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపశమన చర్యలు తీసుకోవాలని ఫెడరేషన్ కోరింది. విమానాల నిర్వహణలో 40 శాతం వాటా ఇంధనానిదే కావడం, ఇటీవల ఏటీఎఫ్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విమాన సంస్థలు ఈ లేఖ రాశాయి. రెండు నెలలుగా ఇరాన్ యుద్ధం కొనసాగుతుండటంతో క్రూడాయిల్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ఏటీఎఫ్‌తో సహా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
విమానాల విడిభాగాలు, లీజు చెల్లింపులు ఖరీదైనవిగా మారుతున్నాయి. టిక్కెట్ ధరలపై తీవ్రమైన పోటీ కారణంగా లాభాలు కూడా తగ్గుతున్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇంధనం ధరల్లో పెరుగుదల ఎయిర్‌లైన్ నెట్‌వర్క్‌ను దెబ్బతీసి, నిర్వహణ తలకుమించిన భారమవుతోందని చెబుతున్నాయి. జెట్ ఫ్యూయల్ ధరలు ఆకాశాన్ని తాకిన నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడం కష్టమవుతోందని ఎఫ్‌ఐఏ తన లేఖలో పేర్కొంది.
ఇప్పటికే విమాన సంస్థలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని గుర్తు చేసింది. ప్రభుత్వ మద్దతులో భాగంగా ఏటీఎఫ్ ధరలను స్థిరీకరించాలని విమాన సంస్థలు కోరుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు, విమాన ఇంధనం (ఏటిఎఫ్) ధరలు విపరీతంగా పెరిగిపోకుండా చూడటానికి గతంలో మాదిరి ‘క్రాక్ బ్యాండ్’ను ఏర్పాటు చేయాలని విమానయాన సంస్థలు కోరుతున్నాయి.
దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలు రెండింటికీ అదే ఇంధన ధరల విధానాన్ని అనుసరించాలని కోరాయి. ఏటీఎఫ్‌పై ఉన్న 11 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తొలగించాలని విమాన సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.

More Stories
ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ఆలోచన లేదు
డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్
2.2 శాతం తగ్గిన దేశీయ వస్త్ర ఎగుమతులు