రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి విడో (వితంతువు), ఆర్ఫన్ (అనాథ)ల పేరిట ఓ సెస్‌ను సుఖ్‌విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై తొలుత 60 పైసల చొప్పున పన్ను విధిస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం నుంచి పెరిగిన రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, విడో సెస్ పేరిట రానున్న కాలంలో పెట్రోల్‌పై రూ. 5 వరకూ వడ్డింపు ఉండొచ్చని సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇటీవల ప్రభుత్వం చట్టసవరణ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినాలంటూ హామీలు కురిపించిన కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేక ఒకవైపు సబ్సిడీలకు కోత పెడుతూ, మరోవైపు వింత పేర్లతో పన్నులవాతకు సిద్ధమవుతున్నది.
సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటే, వాహనాదారులు పొరుగు రాష్ర్టాల పెట్రోల్ బంకుల్లో ఇంధనాన్ని నింపుకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. అప్పుడు రాష్ట్ర ఆదాయానికి పూర్తిగా గండి పడొచ్చని గుర్తుచేశారు. వితంతువు, అనాథల పేరిట వసూలు చేస్తున్న ఈ పన్నులను ప్రభుత్వం ఆయా వర్గాలకు ఎంతమాత్రం ఖర్చుచేయబోదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు.
బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ దీని వెనుక ఉన్న మర్మాన్ని వివరిస్తూ హిమాచల్‌లో డీజిల్‌పై వ్యాట్‌ను ఇప్పటికే రెండుసార్లు పెంచారని గుర్తు చేశారు. మొదట రూ. 3, ఆ తర్వాత మళ్లీ రూ. 3. దీనికి కొత్త సెస్ కూడా కలిపితే, పన్నులు, వ్యాట్ రెండూ కలిపి డీజిల్ ధర వాస్తవంగా రూ. 15.40 పెరిగింది. ఠాకూర్ అంచనా ప్రకారం ఈ వ్యాట్ పెంపులు, సెస్‌ల కలయిక ద్వారా రాష్ట్రానికి ఏటా రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఇది వ్యాపారులు, డ్రైవర్లు, రైతులు, ప్రయాణికులు వంటి సామాన్య ప్రజల జేబులపై నేరుగా పడిన దెబ్బ అని ఆయన అభివర్ణించారు.
రాష్ర్టాన్ని అప్పులపాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడపడానికి ఇలా సామాన్యులపై వసూళ్ల పర్వానికి తెగబడుతున్నదని మండిపడ్డారు. కాగా 2024లో టాయ్‌లెట్ ట్యాక్స్‌ను తీసుకొచ్చి ఇదే సుఖు సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీకి 2022 చివర్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గ్యారెంటీలు ప్రకటించింది.
18 ఏండ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పాత పింఛన్ విధానం అమలు వంటి అనేక హామీలు గుప్పించింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ హామీలను అమలు చేసే స్థితిలో లేదు. ఇదేమీ పట్టించుకోకుండా హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన సుఖు సర్కార్ రాష్ర్టాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టింది.
ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలోకి దిగజారి ఇప్పుడు హామీలకు, సబ్సిడీలకు కత్తెర పెడుతూ సెస్‌ల పేరిట వాతకు దిగింది. అంతేకాదు, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను గణనీయంగా తగ్గించారు. గత ఏడాది రూ. 58,514 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడితే, ఈసారి రూ. 3,586 కోట్లు తగ్గిస్తూ రూ.54,928 కోట్లకు బడ్జెట్‌ను పరిమితం చేశారు.
దేశంలో తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ముందువరుసలో ఉన్నది. ఈ చిన్న రాష్ర్టం అప్పు ఇప్పుడు రూ.1,04,000 కోట్లకు చేరింది. హిమాచల్ జనాభా 76 లక్షలు. ఈలెక్కన రాష్ర్టంలో ఒక్కొక్కరిపై రూ.1.37 లక్షల అప్పు భారం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

More Stories
నియోజకవర్గాల పునర్విభజనకు డీఎంకే మద్దతు?
ఆయుష్ వైద్య విద్యార్థుల మహా ధర్నా.. ఎబివిపి మద్దతు
నేతాజీపై అనుచిత వ్యాఖ్యలు..బిజెపి ఎంపీ `బంగా విభూషణ్’ తొలగింపు