ఏప్రిల్ 29న బెంల్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారన్న ఊహాగానాలను కేంద్రం తోసిపుచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రణాళికలు ప్రభుత్వానికి లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. “పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు” అని పశ్చిమాసియా పరిణామాలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు.
పైగా, డిమాండ్‌ను తీర్చడానికి దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ఎల్‌పీజీ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి అన్ని ఇంధనాల నిల్వలు తగినంతగా ఉన్నాయని ఆమె తెలిపారు. “కొన్ని చోట్ల భయాందోళనలతో ఎక్కువగా కొనుగోళ్లు జరపడాన్ని మేము గమనించాం. ఈ ప్రాంతాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. నిల్వలు అందుబాటులో ఉండేలా, ఎక్కడా కొరత ఏర్పడకుండా ఉండేందుకు అన్ని రిటైల్ అవుట్‌లెట్లను పర్యవేక్షిస్తున్నాం” అని ఆమె చెప్పుకొచ్చారు.
“కొనుగోళ్లు పెరిగిన పెట్రోల్ పంపుల వద్ద సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. మా వద్ద ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాలు పుష్కలంగా ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉన్నాయి. రేట్లలో ఎలాంటి పెరుగుదల లేదు. దయచేసి వదంతులను నమ్మవద్దని నేను అందరినీ కోరుతున్నాను. భయాందోళనలతో కొనుగోళ్లు చేయడం మానుకోండి. సమాచారం కోసం అధికారిక వర్గాలను నమ్మండి” అని ఆమె వివరించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల కారణంగా గత రెండు నెలల్లో ముడి చమురు ధరలు 50 శాతానికి పైగా పెరిగినప్పటికీ, రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో వరుసగా నాలుగో ఏడాది కూడా స్థిరంగా ఉన్నాయి. ముడిసరుకుల ధరలకు, పెట్రోల్ పంపు ధరలకు మధ్య పెరుగుతున్న వ్యత్యాసం ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లకు భారీ నష్టాలను మిగిల్చింది.
కొన్ని అంచనాల ప్రకారం రోజువారీ నష్టం సుమారు రూ. 2,400 కోట్లుగా ఉంది. మరోవైపు ధరలు పెరుగుతాయనే వదంతులతో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక పట్టణాల్లో ప్రజలు భయాందోళనలతో కొనుగోళ్లు చేశారు. ఫలితంగా కొరత ఏర్పడి ఆదివారం 400కు పైగా పెట్రోల్ పంపుల్లో ఇంధనం ఖాలీ అయ్యిందని నివేదికలు చెబుతున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకారం కొన్ని అవుట్‌లెట్లలో డిమాండ్ 30-33 శాతం వరకు పెరిగింది. ప్రపంచ ముడి చమురు ధరలు, అంతర్జాతీయ, దేశీయ ఇంధన ధరల మధ్య పెరుగుతున్న వ్యత్యాసాల కారణంగా ఎన్నికల తర్వాత లీటరుకు రూ. 25-28 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు గతంలోనే హెచ్చరించారు.

More Stories
పెరిగిన ఇంధనం ధరలతో విమానాలు నడపలేం!
డిజిటల్ అరెస్టు మోసాల కట్టడికి బయోమెట్రిక్ సిమ్ వెరిఫికేషన్
2.2 శాతం తగ్గిన దేశీయ వస్త్ర ఎగుమతులు