* బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న తీవ్రమైన అసెంబ్లీ ఎన్నికల పోరులో, అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం నాడు వీధుల్లో హోరాహోరీగా తలపడ్డాయి. బుధవారం జరగనున్న రెండో దశ పోలింగ్‌కు 48 గంటల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, సాయంత్రం 6 గంటల ప్రచార గడువు ముగిసేలోపు, అగ్ర నాయకుల ప్రచార కార్యక్రమాలు ప్రజలను చేరుకునేందుకు చివరి ప్రయత్నం చేశాయి.
దక్షిణ కోల్‌కతాలో భారీ రోడ్‌షోతో మమతా బెనర్జీ తన ప్రచారాన్ని ముగించారు. నాలుగోసారి అధికారంలోకి వస్తాననే ఆత్మవిశ్వాసంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు టిఎంసి అధినేత్రిని చూసేందుకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు బారులు తీరారు. మమతతో పాటు ఆమె పార్టీ నాయకులు ఎంపీ సాగరికా ఘోష్, టోలీగంజ్ అభ్యర్థి ఆరూప్ బిస్వాస్, రాష్‌బిహారి అభ్యర్థి దేబాశిష్ కుమార్ పక్కనే నడిచారు.
మమత హెల్మెట్ ధరించి మోటార్‌సైకిల్ వెనుక కూర్చుని ప్రయాణించడం కూడా కనిపించింది. ఇది ప్రచార చివరి రోజులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకుడు తేజస్వి యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్రంలోని అధికార పార్టీకి తమ మద్దతును ప్రకటించడంతో, తాను ఒంటరిని కానని, బీజేపీ బలాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల మద్దతు తనకు ఉందని మమత ఒక సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్‌పూర్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో దశ పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాలలో ఇది ఒకటి. వచ్చే వారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను మళ్లీ రాష్ట్రానికి వస్తానని ప్రధాని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
“ఈసారి బెంగాల్ పర్యటన నాలో ఒక విలక్షణమైన, ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. మండుతున్న ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, నాకు ఏమాత్రం అలసట అనిపించడం లేదు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి బహిరంగ సభ. మే 4 తర్వాత జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున నేను మళ్లీ ఇక్కడికి వస్తాననే దృఢ విశ్వాసంతో నేను బెంగాల్ నుండి తిరిగి వెళ్తున్నాను,” అని ప్రధాని మోదీ తెలిపారు.
బారక్‌పూర్‌లో ప్రధాని ఒక రోడ్‌షోను కూడా నిర్వహించారు. వీధుల వెంబడి బారులు తీరిన ప్రజల మధ్యగా తన వాహనం వెళ్తుండగా, ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ప్రధాని ఇలా తెలిపారు:, “బెంగాల్ పట్ల నాకు ఉన్న అనుబంధం శక్తి పట్ల భక్తి. ఇది నా వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణానికి శక్తి కేంద్రంగా ఉంది.”
గత కొన్ని నెలలుగా బీజేపీ అగ్ర నాయకత్వం రాష్ట్రంలో ప్రచారం చేస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రజలను చేరుకోవడానికి సాగిస్తున్న ఈ శక్తి ప్రదర్శనకు వారాంతం, సోమవారం ముగింపు పలికాయి. టీఎంసీ బిజెపి బయటి పార్టీ అనే వాదన కొంతమంది ఓటర్లను ఆకట్టుకుంది. మరోవైపు,బిజెపి ప్రజలకు తాము దగ్గరగా ఉన్నామని చాటిచెప్పడానికి ఓటర్లను చేరుకోవడంలో అన్ని విధాలా ప్రయత్నించింది. మమత పాలన, రాష్ట్రలో శాంతి భద్రతలు, గుర్తింపు సమస్యలను ప్రస్తావిస్తూ అమిత్ షా, యోగి ఆదిత్యానాథ్ తదితరులు ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున విమర్శలకు దిగారు.
బుధవారానికి ముందున్న ఈ నిశ్శబ్ద కాలం ఓర్పు, సంకల్పంతో ముందుకు సాగాల్సిన సమయం. 152 నియోజకవర్గాల్లో జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 92.7 శాతం ఓటింగ్ నమోదు కావడంతో, బీజేపీ, టీఎంసీ రెండూ ఇప్పటికే తమ తమ విజయాలను ప్రకటించుకున్నాయి. అభిప్రాయాలు బలపడుతున్నప్పటికీ, నందిగ్రామ్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ టీఎంసీ అధినేతను ఓడించాలని ఆశిస్తున్న మమత, ఆమె బద్ధశత్రువు సువేందు అధికారి మధ్య భవానిపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న హోరాహోరీ పోరులో అసలైన పరీక్ష బ్యాలెట్ పెట్టె వద్దే జరగనుంది.
ఇలా ఉండగా, పశ్చిమబెంగాల్‌లో రెండో విడత పోలింగ్ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది. కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్‌లోని 142 నియోజకవర్గాల్లో ఈనెల 29న కీలకమైన రెండో విడత పోలింగ్ జరుగనుంది. లూథియానాకు చెందిన అజయ్ పాల్ శర్మ ఉత్తరప్రదేశ్ ఐపీఎస్-2011 బ్యాచ్‌కు చెందిన అధికారి. పోలీసు శాఖలో అత్యంత సమర్థుడైన అధికారిగా పేరుతెచ్చుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన అనేక ఆపరేషన్లలో ఆయన పాల్గొన్నారు. బెంగాల్ రెండో విడత పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.
ఏడు జిల్లాలో 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. దీనికి అదనంగా 142 మంది సాధారణ పరిశీలకులు, 95 మంది పోలీసు పరిశీలకులు, 100 మంది వ్యయ పరిశీలకులను ఏర్పాటు చేసింది. రియల్ టైమ్ మానిటరింగ్ కోసం కెమెరాలతో కూడిన డ్రోన్‌లను సిద్ధం చేశారు. కోల్‌కతాలో అత్యధికంగా 273 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఈ విడత 3 కోట్ల 64 లక్షల పైచిలుకు ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 41 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.

More Stories
ఏఐతో సంక్లిష్ట వైరస్‌లను సృష్టించగల మిథోస్ ముప్పు!
రెండేళ్లలో తెలంగాణ ఐటీ రంగంలో రెండు లక్షల ఉద్యోగులకు ముప్పు!
లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాల ఏర్పాటు