హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేసిన పాక్ సుప్రీంకోర్టు

కరాచీలోని ఓ హిందూ ధర్మశాల కూల్చివేతను నిలిపివేయాలంటూ అక్కడి అధికార యంత్రాంగానికి పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైనారిటీల హక్కులపై 2014లో వెలువడిన తీర్పును అమలు చేయడానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. 

కరాచీ నడిబొడ్డున సద్దార్ టౌన్-1లో ప్రభుత్వం లీజుకు ఇవ్వదల్చుకున్న 716 స్కేర్ యార్డుల ఈ స్థలం ఒక ధర్మశాలకు సంబంధించినదని విచారణ సందర్భంగా మైనారిటీ కమిషన్ సభ్యుడు డాక్టర్ రమేశ్ కుమార్ ధర్మాసనానికి నివేదించారు. అందులోని ధర్మశాల భవంతికి సంబంధించిన ఫోటోలను కూడా కోర్టుకు సమర్పించారు. 

ఎవాక్యూ ట్రస్ట్ ప్రోపర్టీ బోర్డు (ఈటీపీబీ) ఈ స్థలాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తికి లీజుకు ఇచ్చిందనీ.. అతడు ధర్మశాలను కూల్చి వాణిజ్య భవనం నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడని రమేశ్ కుమార్ ధర్మాసనానికి వివరించారు.

ధర్మశాల భవనాన్ని కూల్చి, ఆ స్థలాన్ని లీజుకు ఇచ్చి, కొత్త భవనం నిర్మించేందుకు ఈటీపీబీకి అనుమతులు ఇస్తూ సింధ్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈటీపీబీ చైర్మన్ కూడా అనుకూలంగానే ఉన్నారంటూ రమేశ్ ఆరోపించారు. అయితే సింధ్ కోర్టు ఇచ్చిన తీర్పు తమ దృష్టికి రాలేదని కోర్టు పేర్కొంది. 

ఈ భవనాన్ని 1932లో నిర్మించినట్టుగా ఫొటోలను బట్టి తెలుస్తోందని, అది కచ్చితంగా వారసత్వ సంపద కిందికే వస్తుందని కోర్టు పేర్కొంది. ఈ భవనానికి సంబంధించి నివేదిక సమర్పించాలంటూ సింధ్ హెరిటేజ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. 

ఈలోగా ధర్మశాల భవనాన్ని ఎవరూ కూల్చవద్దనీ, అందులోకి ఎవర్ని ప్రవేశించకుండా చూడాలని సింధ్ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. దేశ విభజన సమయంలో పాకిస్తాన్ విడిచి వెళ్లిన హిందువులు, సిక్కుల విద్యా, స్వచ్ఛంద, మత సంస్థల ట్రస్టులు సహా అన్ని ఆస్తులను ఈటీపీబీ పర్యవేక్షిస్తుంది.