మరో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు

మరో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భారతీయులు గల్లంతు
భారతీయ సిబ్బందితో వెళ్తున్న మరో వాణిజ్య నౌకపై ఒమన్‌ తీరంలో అమెరికా నౌకాదళం దాడి చేసింది. నాలుగు రోజుల క్రితమే మారివెక్స్‌ అనే నౌకపై దాడి చేయగా, అందులోని 24 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బుధవారం అదే ప్రాంతంలో పలావు దేశ పతాకంతో వెళ్తున్న సెట్టిబెల్లో అనే కెమికల్‌, ఆయిల్‌ ట్యాంకర్‌పై అమెరికా నౌకాదళం దాడి చేసింది. దీంతో నౌక ఇంజన్‌ వైపు భాగం తీవ్రంగా దెబ్బతిన్నది.
 
 ఈ నౌకలో 24 మంది భారతీయులు ఉండగా, సహాయక సిబ్బంది వీరిలోంచి 21 మందిని రక్షించారు. మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు. అయితే, ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లోని అమెరికా రాయబారికి ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.  ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి చేయడాన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (అమెరికాకు) నాగరాజు నాయుడు ఢిల్లీలోని అమెరికా రాయబారి జేసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేశారు.  హార్ముజ్ జలసంధి వద్ద, ఒమన్ తీరంలో సెట్టెబెల్లే అనే వాణిజ్య నౌకపై బుధవారం ఉదయం అమెరికా దాడి చేసింది. ఇందులో 24 మంది భారతీయులున్నారు. రెస్క్యూ బృందాలు ఈ నౌకలోని 21 మందిని రక్షించగా, మరో ముగ్గురు భారతీయులు గల్లంతయ్యారు.   ఈ అంశంపై ఒమన్ రాయబార కార్యాలయంతో కలిసి పని చేస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. 
 
ఒమన్ అదికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ‘‘ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడిని ఖండిస్తున్నాం. ఈ దాడిలో 21 మంది భారతీయుల్ని రక్షించగా, మిగిలిన ముగ్గురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒమన్ అధికారులతో కలిసి, సమన్వయంతో పని చేస్తున్నాం. హార్ముజ్ మార్గంలో ఇలా నిరంతరం నౌకలపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది”  అని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.
 
“ఈ ప్రాంతంలో శాశ్వతమైన శాంతి నెలకొనేందుకు తగిన పరిష్కారం కోసం జరుగుతున్న చర్చలకు త్వరగా ముగింపు పలకాలి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని పునరుద్ధరించాలి” అని కోరింది. అమెరికా యుద్ధ విమానం నుంచి దాడి చేయడంతో నౌక ఇంజిన్ దెబ్బతింది. అమెరికా దళాలు చేసిన సూచనను నౌకలోని సిబ్బంది పాటించకపోవడంతోనే ఈ దాడి చేశామని అమెరికా తెలిపింది.