ఎల్‌జెపి నేతగా చిరాగ్‌ పాశ్వాన్‌ తొలగింపు 

బీహార్‌లో చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జెపి)లో అసమ్మతి రాజ్యమేలింది. ఆదివారం రాత్రి ఐదుగురు ఎంపిలు పాశ్వాన్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు పాల్పడ్డారు. పాశ్వాన్‌ను పార్టీ లోక్‌సభ పక్ష నేతగా తొలగిస్తూ,  పశుపతి కుమార్‌ను పార్టీ పక్షనేతగా ఎన్నుకున్నట్లు స్పీకర్‌ ఓం ప్రకాశ్‌ బిర్లాకు లేఖ రాయడం సంచలనం కలిగిస్తున్నది. 

ప్రస్తుతం లోక్‌సభలో చిరాగ్‌ పాశ్వాన్‌తో కలిపి ఆరుగురు ఎల్‌జెపి ఎంపిలు ఉన్నారు. గత ఏడాది ఆయన తండ్రి, ఎల్‌జెపి వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణించిన తర్వాత పార్టీ పగ్గాలను పాశ్వాన్‌ తీసుకున్నారు. కాగా, పాశ్వాన్‌పై తిరుగుబాటు దళానికి నాయకత్వం వహిస్తుంది కూడా ఆయన బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌ కావడం గమనార్హం. 

ఆయన రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు సోదరుడు అవుతారు. పాశ్వాన్‌పై ఆయనతో పాటు కజిన్‌ ప్రిన్స్‌రాజ్‌, చందన్‌ సింగ్‌, వీణాదేవీ, మెహబూబ్‌ అలీ కైజర్లు తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. వీరంతా రాబోయే రోజుల్లో జెడియుకి మద్దతునిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు నుండి ఎల్‌జెపి విడిపోయి ఒంటరిగా పోటీ చేసిన సంగతి విదితమే. దీనివల్ల జెడియుకి తీవ్ర నష్టం వాటిల్లడంతో, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎత్తుగడ కారణంగానే ఈ తిరుగుబాటు జరిగిన్నట్లు పలువురు భావిస్తున్నారు.  కాగా, చిరాగ్‌ ఈ అంశంపై మాట్లాడేందుకు పశుపతి ఇంటికి వెళ్లగా…. ఆయనతో మాట్లాడలేదని తెలుస్తోంది.