శశికళతో మాట్లాడితే అన్నాడీఎంకే నుండి వేటే!

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి వి కె శశికళ `రాజకీయ సన్యాసం’ విడిచిపెట్టి, తిరిగి క్రియాశీల రాజకీయాలలో ప్రవేశిస్తున్నట్లు సంకేతాలు ఇస్తూ ఉండడంతో అన్నాడీఎంకే నేతలలో అభద్రతా భావం నెలకొంటున్నట్లు కనిపిస్తున్నది. తమ పార్టీ నేతలు ఎవ్వరైనా ఆమెతో మాట్లాడినా అనుమానపడుతున్నారు. 
 
శ‌శిక‌ళ‌తో మాట్లాడే వారిని పార్టీ నుంచి బ‌హ‌ష్క‌రిస్తామ‌ని తాజాగా  ఏఐఏడీఎంకే త‌మ నేత‌ల‌ను హెచ్చ‌రించింది. సోమ‌వారం జ‌రిగిన పార్టీ శాసనసభ సభ్యుల స‌మావేశంలో ఈ మేర‌కు ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఏక‌గ్రీవంగా ఆమోదించింది. గత నెలరోజులుగా ఎడమొఖం, పెడముఖంగా ఉంటూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రులు పళనిసామి, పన్నీరుసెల్వం ఉమ్మడిగా స్వరం వినిపించారు. 
 
పన్నీరుసెల్వంను శాసనసభా పార్టీ ఉపనాయకుడిగా ఎన్నుకోగా మిగిలిన పదవులను ఇద్దరి మద్దతుదారులకు పంచుకున్నారు. ప్రస్తుతం పళనిసామి శాసనసభ పక్ష నాయకుడు కావడం తెలిసిందే. కాగా ఆయన మద్దతుదారుడు  ఎస్పీ వెళ్లుమనిని పార్టీ విప్ గా ఎన్నుకున్నారు. పన్నీరుసెల్వం మద్దతుదారులు ఎస్ రవిని డిప్యూటీ విపిగా, కదంబర్ సి రాజు ను కోశాధికారిగా, కెపి అన్బళగన్ ను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 
 
తాను త్వ‌ర‌లోనే క్రీయాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని, అన్నాడీఎంకేపై ప‌ట్టుసాధిస్తాన‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు నేత‌ల‌తో వీకే శ‌శిక‌ళ ఇటీవ‌ల మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ బ‌య‌ట‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే ఈ కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవడం గమనార్హం. శ‌శిక‌ళ‌తో మాట్లాడే వారిని పార్టీ నుంచి బ‌హిష్క‌రిస్తామ‌ని నేత‌ల‌ను హెచ్చ‌రించింది.
 
పార్టీకి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించేవారిపై క్ర‌మ‌శిక్ష‌ణ కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించింది. సోమ‌వారం జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ఈ మేర‌కు ఒక తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టి ఆమోదించింది. అనంత‌రం శ‌శిక‌ళ‌తో ఇటీవ‌ల‌ మాట్లాడిన 16 మంది పార్టీ కార్యకర్తలను అన్నాడీఎంకే బహిష్కరించింది. అలాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్ప‌డిన పార్టీ ప్రతినిధి వీ పుగజేండిని కూడా బహిష్కరించింది.