గిరిజనుల తిరుగుబాటుతో బలం కోల్పోతున్న మావోయిస్టులు 

అటవీ ప్రాంతాలలో స్థానిక గిరిజనులు తిరగపడుతూ ఉండడంతో మావోయిస్టులు గత కొన్ని సంవత్సరాలుగా బలహీన పడుతున్నారని బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ లోని అసోసియేట్ ప్రొఫెసర్ డా. అనుషూమన్ బెహెర తెలిపారు.
ఆసియన్ యురేషియా హ్యూమన్ రైట్స్ ఫోరమ్, ది నేరేటివ్ ల ఆధ్వర్యంలో జరిగిన వెబినార్ లో “ఆసియా దృక్పధంలో మావోయిజం, మానవ హక్కుల పరిస్థితుల అంశం” గురించి మాట్లాడుతూ మొత్తం దక్షిణ ఆసియా దేశాలలో, 60వ దశకంలో దాదాపు ఒకే సమయంలో  మావో పేర్కొన్న `నూతన ప్రజాస్వామ్యం’ పేరుతో తీవ్రవాద నక్సల్ బృందాలు బలం పుంజుకొంటూ వచ్చాయని చెప్పారు.
భారత దేశంలో మావోయిస్టుల కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2010 నుండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చినదని తెలిపారు. మావోయిస్టుల పై దాడులు పెరగడం, వారి కీలక నాయకులను హతమార్చడం ప్రారంభమైనదని చెప్పారు.
భారత ఆంతరంగిక భద్రతకు అతిపెద్ద ముప్పు మావోయిస్టుల నుండే ఏర్పడుతున్నది అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మావోయిస్టుల హింసాయుత చర్యలను వారికి మద్దతుగా ఉంటున్న పౌరసమాజ సంస్థలు, మేధావులు ప్రభుత్వ హింసకు ప్రతిస్పందన అంటూ మద్దతు ఇస్తూ వస్తున్నారని బెహెర పేర్కొన్నారు.
అయితే 2013-14 నుండి స్థానిక గిరిజనుల నాయకత్వం సమాయత్తం అవుతూ, మావోయిస్టుల మతిలేని హింసను వ్యతిరేకిస్తూ, తిరగబడుతూ రావడంతో వారు వెనుకంజ వేయవలసి వస్తున్నట్లు వివరించారు. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ లలో ఇటువంటి పరిస్థితిని మనం చూడవచ్చని అన్నారు.
 ప్రస్తుతం మావోయిస్టులు సైదంతిక ప్రాతిపదికను కోల్పోయి, క్రిమినల్ గ్యాంగ్ లవలె వ్యవహరిస్తున్నారని, బెదిరించి డబ్బు వసూలు చేయడం చేస్తున్నారని, దానితో స్థానిక గిరిజనుల మద్దతు కోల్పోతూ వస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. 1995 నుండి భారత దేశంలోని నక్సలైట్ లలో ముఠాతత్వం పెరిగిపోయి, ముఠాలుగా విడిపోయి, వారిలోనే వారు పరస్పరం దాడులు చేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయని బెహరా గుర్తు చేశారు.
1980వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన ఫూపుల్స్ వార్, బీహార్లో ఏర్పడిన ఎంసీసీఐ బలమైన సాయుధ దళాలుగా రుపొందాయని, హింసాయుత చర్యలకు పెద్దఎత్తున దిగడం ప్రారంభించారని వివరించారు.
2014లో ఈ రెండు కలసి సిపిఐ (మావోయిస్టు)గా ఏర్పడడంతో హింసాయుత చర్యలు మరింతగా ఊపందుకున్నాయని చెప్పారు. చాలామంది అమాయక గిరిజనులను తమ ఆదేశాలను అమలు పరచలేదనో, తమ ఆధిపత్యంకు అడ్డు అనో నిర్ధాక్షణ్యంగా చంపివేస్తూ రావడంతో క్రమంగా వారి నుండే ప్రతిఘటన ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడినదని బెహరా పేర్కొన్నారు.
పౌర హక్కుల సంఘాలు ఎప్పుడు ఏకపక్షంగా నివేదికలు ఇస్తున్నాయని, మావోయిస్టుల మతిలేని హింసను ప్రశ్నించడం లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా తన నివేదికలో పేర్కొనడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కొందరు నగరాలకు పరిమితమైన `మేధావులు’ క్షేత్రస్థాయిలో వస్తావా పరిస్థితులను తెలుసుకోకుండా వారికి మద్దతుదారులుగా మారుతున్నారని విస్మయం వ్యక్తం చేశారు.
మావోయిస్టులను కట్టడి చేయడంలో ప్రభుత్వం కేవలం బలప్రయోగంపై ఆధార పడకుండా స్థానిక గిరిజన నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలని, స్థానికంగా ప్రజాస్వామ్య పక్రియను సులభతరం చేయాలని, ప్రభుత్వం కార్యక్రమాలలో వారికి భాగస్వామ్యం కల్పించాలని బెహరా సూచించారు.