
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఈటల బిజెపి కండువా కప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య తదితరులు బీజేపీలో చేరారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, పార్టీ ఎమ్యెల్యే రఘునందనరావు, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భరోసా వ్యక్తం చేశారు. ఈటల రాజేంద్రర్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు. బీజేపీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా శ్రమిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని ఈటల వెల్లడించారు.
రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దానిని వెంటనే స్పీకర్ పోచారం ఆమోదించారు. దీంతో త్వరలో హుజురాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగనుంది. ఈసారి బీజేపీ అభ్యర్థిగా ఈటల బరిలో దిగబోతున్నారు.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ నడిచింది. బీజేపీకి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే, ఈ సారి బీజేపీ అభ్యర్థిగా ఈటల రంగంలో దిగబోతున్నారు. గతంలో గులాబీ ఫోటోతో ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఈటల ఈసారి కాషాయ బొమ్మపై బరిలో దిగి విజయం సాధిస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.
ఇక, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో బిజెపి బలపడనుంది. గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ నియంతృత్వ పాలన నుంచి బయటకు రావాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బిజెపి జెండా పట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణలో ‘గడీల పాలన’ను బద్దలు కొట్టాలని ఈటల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం బీజేపీ అండగా ఉంటుందని పేర్కొంటూ కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
More Stories
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
శ్రీహరికోటలోని షార్లో తీవ్రవాదులంటూ బెదిరింపు
హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు