థర్డ్‌ వేవ్‌లో పిల్లలకే అధిక ముప్పు వాస్తవం కాదు 

థర్డ్‌ వేవ్‌లో పిల్లలకే అధిక ముప్పు వాస్తవం కాదు 
థర్డ్‌ వేవ్‌లో కేవలం పిల్లలకే అధిక ముప్పు ఉంటుందన్నది సరికాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారత్‌లో పిల్లలకు కొవిడ్‌ ముప్పు పేరుతో ది లాన్సెట్‌ కొవిడ్‌-19 కమిషన్‌, ఇండియన్‌ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పిల్లల వైద్య నిపుణులు నివేదికను రూపొందించారు. అయితే  అందరిలాగే వారికి ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 
 
తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పది ఆసుపత్రుల్లో చికిత్స పొందిన చిన్నారులపై అధ్యయనం సాగింది. 2,600 మంది చిన్నారుల చికిత్సలను అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు పిల్లల వైద్య నిపుణులతో అధ్యయనం నివేదిక తయారు చేశారు.

చాలా మంది పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించకపోవచ్చని.. కనిపించినప్పటికీ తేలిక పాటి, లేదంటే మితంగా ఉండొచ్చని తెలిపారు. వైద్యుల సలహాతోనే ఇంట్లోనే చికిత్స అందివచ్చని పేర్కొన్నారు. అయితే, ఎక్కువ మంది చిన్నారులు, జ్వరం, శ్వాస సమస్యలు, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.

మరో వైపు కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరిన చిన్నారుల్లో 2.4 శాతం మరణాలు సంభవించాయని నిపుణులు తెలిపారు. 9 శాతం మందే తీవ్రమైన లక్షణాలతో బాధపడినట్లు పేర్కొన్నారు. డయాబెటిస్‌, క్యాన్సర్‌, రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి దిగజారుతోందని అధ్యయనం తెలిపింది.  సాధారణంగా ఆరోగ్యకరమైన పిల్లలలో కరోనాతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం చాలా తక్కువని వెల్లడించింది. 

కాగా, కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో పిల్లల సాధారణ రోగనిరోధకత గణనీయంగా తగ్గడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంవత్సరం లోపు 20-22లక్షల మంది పిల్లలకు ప్రతి నెలా జాతీయ కార్యక్రమాల మేరకు టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, సంవత్సరానికి 260 లక్షల మంది పిల్లలకు విస్తరించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో పిల్లలకు టీకాల షెడ్యూల్ భారీగా ప్రభావితమైంది. డీటీపీ, న్యుమోకాకల్‌, రోటా వైరస్‌, ఎంఎంఆర్ వ్యాక్సిన్లు చాలా మంది పిల్లలకు వేయలేదు. కరోనా సంక్రమణ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను టీకా కేంద్రాలకు తీసుకువచ్చేందుకు భయపడ్డారని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది పేర్కొంటున్నారు.

ఇలా ఉండగా, కరోనా రెండో వేవ్‌లో సాధారణ రోగనిరోధకతలో 60 శాతం తగ్గుదల చూశామని, ఇది గత సంవత్సరం క్షీణత రేటు కంటే ఎక్కువగా ఉందని కొలంబియా ఆసియా ఆసుపత్రి పిల్లల వైద్యుడు సుమిత్ గుప్తా తెలిపారు.

దీనికి కారణం, కరోనా కాలంలో చాలా మంది ఆసుపత్రులను వచ్చేందుకు భయపడడంతో పాటు లాక్‌డౌన్‌ కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక కొందరికి టీకాలు తప్పిపోయారని పేర్కొన్నారు. టీకాలు వేసేందుకు నెల నుంచి రెండు నెలలు ఆలస్యం కావచ్చని చెప్పారు. సరైన సమయంలో పిల్లలకు సరైన రోగనిరోధక శక్తి కోసం షెడ్యూల్‌ ప్రకారం తప్పనిసరిగా టీకాలు వేయాలని సూచించారు.