ఆయుష్మాన్‌ భారత్‌ లోకి 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలు

దేశంలోని లక్షా 50 వేల ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలను 2022 డిసెంబరు నాటికి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ (ఏబీ-హెచ్‌డబ్ల్యూసీ) పరిధిలోకి తీసుకొస్తామని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మరింత సమర్ధవంతంగా కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ఈ చర్య తోడ్పడుతుందని పేర్కొంది.
 
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం విస్తృతంగా ఆరోగ్య సదుపాయాలు కల్పించిందని, 2020 మార్చి 31 నాటికి దేశవ్యాప్తంగా 1,55,404 ఉప ఆరోగ్య కేంద్రాలు (ఎస్‌హెచ్‌సీ), 24,918 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), 5,895 పట్టణ పీహెచ్‌సీలు ఉన్నాయని వెల్లడించింది.  
 
వీటిలో 1.5 లక్షల ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలను ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతామని పేర్కొంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే దిశగా ఇదో గొప్ప ముందడుగు అవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.   
 
కాగా, కరోనాకు వ్యతిరేకంగా టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని సాధించింది. శనివారం నాటికి టీకా డ్రైవ్‌ 148వ రోజుకు చేరగా.. 25,28,78,702కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. మరో వైపు 20,46,01,176 మొదటి టీకా డోసులు వేసి చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం ఒకే రోజు మొత్తం 31,67,961 మోతాదులు వేసినట్లు చెప్పింది. 
 
మరోవంక, క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రేటు, ఎంత‌మందిలో యాంటీబాడీలు ఉన్నాయ‌నేది గుర్తించేందుకు దేశ‌వ్యాప్తంగా సెరలాజిక‌ల్ స‌ర్వే ను నిర్వ‌హించాల్సిన అవ‌సరం ఉంద‌ని సీసీఎంబీ స‌ల‌హాదారు డాక్ట‌ర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు మ‌నం ఎంత దూరంలో ఉన్నామ‌నేది కూడా సెరో సర్వేలో అంచ‌నా వేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. దేశంలోని ఏ ప్రాంతంలో పాజిటివిటీ రేటు త‌క్కువ‌గా ఉంద‌నేది కూడా ఈ స‌ర్వేలో గుర్తించ‌వ‌చ్చ‌ని తెలిపారు.