కరోనా రోగులకు ఎస్‌బీఐ రూ 5 లక్షల వరకు రుణం  

కరోనా చికిత్స కారణంగా ఆర్థిక ఒత్తిడితో చితికిపోతున్న మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ‘కవాచ్ పర్సనల్ లోన్’ పేరుతో ఎటువంటి సెక్యూరిటీ లేని రుణాన్ని ప్రవేశపెట్టింది. 
 
కోవిడ్-19 చికిత్స కోసం తన, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం వినియోగదారులకు దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ 8.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది.
 
రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు సంవత్సరానికి 8.5% వడ్డీ రేటుతో ఎవరైనా లోన్ తీసుకోవచ్చు. ఈ లోన్ గరిష్ఠ గడువు చెల్లింపు కాలం 60 నెలలు. లోన్ తీసుకున్న మూడు నెలలు ఈఎమ్ఐ కూడా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్‌బీఐ కోవిడ్ సహాయక చర్యలకు అనుగుణంగా బ్యాంకులు అందిస్తున్న కోవిడ్ -19 లోన్ లలో ‘కవాచ్ పర్సనల్ లోన్’ కూడా ఒకటని ఎస్‌బిఐ పేర్కొంది. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేకపోవడం గమనార్హం. 
 “ఈ కరోనా మహమ్మారి కాలంలో కోవిడ్ సోకిన కుటుంబాల కోసం ఎటువంటి పూచీకత్తు లేని వ్యక్తిగత రుణాలను ఇవ్వనున్నాము. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితిలో మా ఖాతాదారుల కుటుంబాలు ఆర్ధికంగా ఊబిలో చిక్కుకోకుండా ఉండటానికి దీనిని ప్రవేశ పెట్టినట్లు” ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు.