మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిలు నిరాకరణ 

బ్యాంకులను మోసగించిన కేసులో నిందితుడు మెహుల్ చోక్సీకి బెయిలు మంజూరు చేసేందుకు డొమినికా హైకోర్టు తిరస్కరించింది. డొమినికా స్థానిక మీడియాను ఉటంకిస్తూ ఓ భారతీయ వార్తా సంస్థ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, విచారణ నుంచి తప్పించుకునేందుకు పారిపోయే ప్రమాదం ఉందని చెప్తూ, మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిలును నిరాకరించింది.

మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేరకు మోసగించినట్లు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోయిన మెహుల్ చోక్సీ మే 23న అదృశ్యమయ్యారు. ఆ తర్వాత డొమినికన్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 

ఆయనను భారత దేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈలోగా ఆయన బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన డొమినికా హైకోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసేందుకు తిరస్కరించింది. 

జడ్జి వైనంటే అడ్రియెన్-రాబర్ట్స్ ఇరు పక్షాల వాదనలను విన్నారు. అనంతరం చోక్సీ బలమైన హామీని ఇవ్వలేకపోయారని, ఆయన విచారణను తప్పించుకుని, పారిపోయే ప్రమాదం కూడా ఉందని ప్రధానంగా చెప్పారు. డొమినికాతో చోక్సీకి ఎటువంటి సంబంధాలు లేవని, ఆయన విచారణ నుంచి తప్పించుకోకుండా చేయగలిగే షరతులను విధించడం సాధ్యం కాదని తెలిపారు.

తాను తన సోదరునితో కలిసి హోటల్‌లో ఉంటానని చోక్సీ చెప్తున్నారని, ఇది స్థిరమైన చిరునామా కాదని తెలిపారు. ఆయనపై నమోదైన ఆరోపణలపై విచారణ ఇంకా ప్రారంభం కాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

చోక్సీ తరపున న్యాయవాదులు వినిపించిన వాదనల్లో ఆయన తప్పించుకుపోబోరని, ఆయన ఆరోగ్య కారణాల రీత్యా వైద్య చికిత్స జరగవలసి ఉందని చెప్తూ, బెయిలు మంజూరు చేయాలని కోరారు. అయితే  చోక్సీని తక్షణమే భారత దేశానికి అప్పగించడం నుంచి ఆయనకు డొమినికన్ కోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.