ఎంపీ నామా ఇంటిపై ఈడీ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం!

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు నివాసం, కంపెనీల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నం.19లో ఉన్న నామా నాగేశ్వర్‌రావు ఇల్లు, రోడ్‌ నం.36లో ఉన్న మధుకాన్‌ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ డైరెక్టర్ల ఇళ్లు కలిపి ఆరు చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. 
ఖమ్మం, హైదరాబాద్ లలో నిన్న ఉదయం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 4 గంటల వరకు, మొత్తం 21 గంటల సేపు తనిఖీలు జరిగాయి. సోదాలు పూర్తయిన తర్వాత నామాకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని అందులో తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.
జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఈడీ ఈ తనిఖీలు చేపట్టింది. ఈ అంశంపై 2019లోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 2020లో చార్జిషీటు దాఖలు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు మళ్లించారని అందులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో  ఈడీ దర్యాప్తు చేపట్టింది. తాజాగా తనిఖీలు నిర్వహించింది.  2011లో జార్ఖండ్‌లో రాంచీ– రార్‌గావ్‌– జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్‌ హైవే–33 పనులను మధుకాన్‌ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్‌ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి  కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది.

తర్వాత మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో నిజాలేమిటో తేల్చాలని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) న్యూఢిల్లీని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టి ప్రాజెక్టు పనుల్లో పురోగతి లేదని, నిధులు పక్కదారి పట్టాయని పేర్కొంది.

ఆ సమయంలో రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే డైరెక్టర్లుగా ఉన్న కె.శ్రీనివాసరావు, ఎన్‌.సీతయ్య, ఎన్‌.పృథ్వితేజ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. మధుకాన్‌ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్‌ చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.