
మాజీమంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి మూడోసారి రాజీనామా చేశారు. ఈటల రాజీనామాపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వేగంగా స్పందించారు. శనివారం ఉదయం 11:30 గంటలకు అసంబ్లీ కార్యదర్శికి ఈటల రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.
వెంటనే హుజురాబాద్ నియోజకవర్గం ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అసంబ్లీ కార్యదర్శి ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు తరువాత ఏడేళ్లల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా నిలిచారు.
రాజీనామాకు ముందు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తూ చట్టాన్ని అపహాస్యం చేసేలా తెలంగాణలో రాజకీయాలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల్లో గెలిచిన వారు రాజీనామా చేయకుండానే నిస్సిగ్గుగా మంత్రులుగా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు.
హుజురాబాద్‌లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని.. కౌరవులకు.. పాండవులకు మధ్య యుద్ధం జరుగుతోందని ఈటల పేర్కొన్నారు. అంతిమంగా తెలంగాణ ప్రజలే గెలుస్తారని స్పష్టం చేశారు. లెఫ్ట్, రైట్ కాదు.. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరీ కట్టడమే లక్ష్యంగా ఇకపై పనిచేస్తానని సంబధం చేశారు.
యావత్ తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈటలను ఎలా చక్రబందంలో పెట్టాలని మాత్రం పోలీసు అధికారులను వాడుతున్నారని అంటూ నిర్బంధాలు తనకు కొత్త కాదని, నియంత నుంచి తెలంగాణను విముక్తి చేయడమే తన ఎజెండా అని ఈటల స్పష్టం చేశారు.
పదవీ కాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి. టీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత ఏడాదికి ఆ పార్టీలో చేరి ఉద్యమస్పూర్తిని ప్రదర్శిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఈటల ఎదిగారు. హైదరాబాద్, గజ్వేల్ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు.
ఆమేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వచ్చిన ఈటల రాజేందర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీచేసి, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు. ఆ తర్వాత ఉద్యమ అవసరాల కోసం 2008, 2010లో రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు.
ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సాధించిన ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
More Stories
మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
శ్రీహరికోటలోని షార్‌లో తీవ్రవాదులంటూ బెదిరింపు
హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు