ఆర్ ఎస్ ఎస్ తో బంధం ఎప్పటిదో….. హేమంత్ బిస్వా శర్మ 

తనను ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఆర్ ఎస్ ఎస్ నాయకత్వం వ్యతిరేకించినట్లు వస్తున్న కథనాలను అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ తీవ్రంగా ఖండించారు. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం నాగపూర్ లో ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భాగవత్ ను కలసి సుమారు 75 నిముషాల సేపు సమాలోచనలు జరిపారు. 
 
తర్వాత  మీడియాతో మాట్లాడుతూ ఆర్ ఎస్ ఎస్ తో తనకు ఎప్పడి నుండో సంబంధం ఉన్నదని, తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా ఉండేదని తెలిపారు. ముఖ్యంగా డా. భాగవత్ తో తనకు చాలా కాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల ముందు ఆయన తమ ఇంటికి కూడా వచ్చారని, ఒక సారి భోజనం కూడా చేశారని, తన అమ్మగారిని కలిసారని, తన పిల్లలకు కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చారని వివరించారు. 
 
తరచుగా డా. భాగవత్ ను కలుస్తూ ఉంటానని, నాగపూర్ వాస్తూ ఉంటానని చెబుతూ నాలుగేళ్ల క్రితం కూడా తాను నాగపూర్ లో ఆర్ ఎస్ ఎస్ కార్యాలయంకు వచ్చానని పేర్కొన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు.  
 
ఈ సందర్భంగా ఆయన ఆర్ ఎస్ ఎస్ వ్యవస్థాపకులు డా. హెగ్డేవార్ స్మారక సమితి ని సందర్శించి, ఆయన స్మృతి మంది వద్ద ఆర్ ఎస్ ఎస్ మొదటి సర్ సంఘ్ చాలక్ కు నివాళులు అర్పించారు. అదే విధంగా ద్వితీయ సర్ సంఘ్ చాలక్ గురూజీకి కూడా ఆయన స్మ్రితి చిహ్న వద్ద కూడా నివాళులు అర్పించారు. 
 
ఇక్కడకు రావడానికి ముందు రోజు అస్సాంలో తాను ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముస్లింలు కుటుంభం నియంత్రణ పాటించాలని తాను ఇచ్చిన పిలుపుకు, ఈ పర్యటనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 
 
ఒక ముఖ్యమంత్రిగా ముస్లింలతో పాటు ప్రజల అందరి అభివృద్ధి తన బాధ్యత అని పేర్కొంటూ, పెద్ద కుటుంబాల కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు వారికి ఆశించిన విధంగా ఉపయోగ పడటం లేదని అన్నారు. ముస్లిములు రెండు రకాలు ఉన్నారని అంటూ, స్థానిక అస్సాం ముస్లింలు చిన్న, చిన్న కుటుంబాలే కలిగి ఉన్నారని, వారంతా మంచి జీవనం గడుపుతున్నారని తెలిపారు. 
 
అయితే బాంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు మాత్రం సగటున 6 నుండి 6 గురు పిల్లలు ఉంటున్నారని, కొన్ని సందర్భాలలో వారి కుటుంభం మొత్తం 20 మంది వరకు ఉంటున్నారని  చెప్పారు. దానితో, వారు మంచి జీవనం గడపలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశారు.  వారు కుటుంభ నియంత్రణ పాటిస్తే వారి జీవితాలలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయని తాము నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 
 
అస్సాం జనాభాలో ఒక కోటి మంది ముస్లింలు ఉండగా, వారిలో 12 నుండి 13 లక్షల మంది స్థానిక ముస్లింలు కాగా, మిగిలిన వారు బాంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారిని తెలిపారు.