ఐఎన్‌సీ పేరును ఏఎన్‌సీగా మార్చుకోండి

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) పార్టీ పేరును ‘యాంటీ నేషనల్ క్లబ్ హౌస్’ (ఏఎన్‌ఎస్)గా మార్చుకుంటే మంచిదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంబిత్ పాత్ర హితవు చెప్పారు. జమ్మూకశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 370 అధికరణ రద్దు నిర్ణయంపై పునరాలోచిస్తామని ఇటీవల జరిగిన ఓ క్లబ్‌హౌస్ ఛాట్‌లో దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పాకిస్థాన్ జర్నలిస్టు ఒకరితో దిగ్విజయ్ సింగ్ చేసిన ‘క్లబ్‌ హౌస్ ఛాట్‌’ను బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్విటర్‌లో ఉంచారు.\
 
”ఇదే దిగ్విజయ్ సింగ్ పుల్వామా దాడిని ఒక ఘటనగా పేర్కొన్నారు. 26/11 ఘటనను ఆర్ఎస్ఎస్ కుట్రగా చెప్పారు. ఆ సమయంలో పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇవన్నీ కాంగ్రెస్ టూల్‌కిట్‌లో భాగమే” అని ఆరోపించారు. 
 
మోదీ అధికారం ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణపై పునరాలోచిస్తాం అని దిగ్విజయ్ అంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రశ్న (జమ్మూకశ్మీర్ అధికరణ) అగినందుకు పాకిస్థాన్ పాత్రికేయునికి థాంక్స్ చెప్పారని గుర్తు చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ తన పేరును ఐఎన్‌సీకి బదులుగా జాతీ వ్యతిరేక క్లబ్ హౌస్ (ఏఎన్‌సీ)గా మార్చుకుంటే మంచిదనిపేర్కొన్నారు. మోదీని, భారత్ ను ద్వేషించే వాళ్లతో ఏర్పడిన క్లబ్ హౌస్ ఇదని సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.