సిఐడి చీఫ్ సునీల్ కుమార్ పై ఆత్మరక్షణలో జగన్!

సిఐడి అదనపు డిజి సునీల్ కుమార్ వ్యవహారంపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. సునీల్ కుమార్ చర్యలకు తన మద్దతు లేదని తెలియచెప్పడం కోసం ఆయనను సిఐడి నుండి బదిలీ చేయవలసిందే అని వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

 ఒక వంక పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణ రాజుపై సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, నిర్బంధంలో చిత్రహింసలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నత న్యాయస్థానాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ విషయమై రఘురామరాజు చేసిన ఫిర్యాదులపై దేశం వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి సిద్దపడుతున్నారు. సునీల్ కుమార్ ఈ విషయమై కోర్ట్ ధిక్కరణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. 

మరోవంక, ఆయన క్రైస్తవుడు కాగా, ఎస్సి రిజర్వేషన్ లో ఐపీఎస్ లో చేరారని, అది చెల్లదని అంటూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా, ఉన్నత పోలీస్ ఉద్యోగంలో ఉంటూ క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొనడమే కాకుండా, మతాల మధ్య విధ్వేషాలను రెచ్చగొట్టే విధంగా వీడియోలను సోషల్ మీడియాలో ఉంచారని కూడా ఫిర్యాదులు వెళ్లాయి.

ఈ ఫిర్యాదులు రాగానే సోషల్ మీడియా నుండి సంబంధిత వీడియోలను ఆయన హడావుడిగా తొలగించారు. ఈ ఫిర్యాదులపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కూడా తగు చర్య తీసుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

అమిత్ షా సహితం ఆగ్రహం

కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను గురువారం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో కలసినప్పుడు సునీల్ కుమార్ వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి అండదండలతోనే ఆ అధికారి ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. 

మరోవంక, రఘురామరాజు వ్యవహారం కూడా ప్రస్తావనకు వచ్చిన్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై అమిత్ షా తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక ఎంపీపై రాజద్రోహం కేసు పెట్టడం ఏమిటి? ఒక ఎంపీని అరెస్టు చేయటం ఏమిటి? ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించటం ఏమిటి? 

కరుడు గట్టిన తీవ్రవాదులు, ఉదగ్రవాదులను కొట్టినట్లుగా ఎంపీని కొట్టడం ఏమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారని వినవస్తున్నది. చంద్రబాబు నాయుడును వ్యతిరేకిస్తూ ఉండడంతో మీకు మద్దతు ఇస్తున్నామని అలుసుగా తీసుకొని ఈ విధంగా వ్యవహరిస్తే సమర్ధింపలేమని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది.

సొంత పార్టీలోనూ లుకలుకలు 

ఇలా ఉండగా, సునీల్ కుమార్ వ్యవహారంపై, ఆయన ఒక ఎంపీ పట్ల వ్యవహరించిన తీరుపై మంత్రివర్గ సహచరులతో పాటుగా సొంత పార్టీ నేతలలో సహితం లుకలుకలు బయలుదేరినట్లు జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వచ్చిన్నట్లు చెబుతున్నారు. 

 అధికార పార్టీకి చెందిన కొందరు ఎంపీలతో పాటు కొందరు మంత్రులు, కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి సిఐడి శాఖ నుండి సునీల్‍ కుమార్‍ను తప్పించమని కోరినట్లు తెలుస్తున్నది. సునీల్ కుమార్ చర్యలకు తన మద్దతు లేదనే సంకేతం ఇవ్వవలసిన అవసరం ఉన్నదని స్పష్టం చేసిన్నట్లు వినవస్తున్నది. 

రఘురామరాజును దగ్గరుండి సునీల్‍ కుమార్‍ ఇబ్బంది పెట్టించి ఉంటారని,  పోలీసు వ్యవస్థకే ఆయన మాయని మచ్చ తెచ్చారని  కొందరు సీనియర్ ఐపిఎస్‍ అదికారులు సహితం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయమై ఇప్పటి వరకు డిజిపి గౌతమ్ సవాంగ్ బహిరంగంగా ఇప్పటి వరకు ఎటువంటి వాఖ్య చేయక పోవడం గమనార్హం.