పేదరికాన్ని తగ్గించడానికి `గౌరవనీయమైన జనాభా నియంత్రణ’ పాటించాలని రాష్ట్రంలోని `ముస్లింలకు అసోం కొత్త ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ విజ్ఞప్తి చేశారు. అసోంలోని ముస్లింలంతా “నాగరిక కుటుంబ నియంత్రణ విధానం” అవలంబించాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటుచేసి 30 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో పేదరికం తగ్గడానికి తమ వంతుగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని, జనాభాను నియంత్రించడంలో సమాజంలోని వాటాదారులంతా పాటుపడాలని కోరారు.
పేద ప్రజలందరికీ ప్రభుత్వం రక్షకుడని, అయితే పేదరికం, నిరక్షరాస్యత, సరైన కుటుంబ నియంత్రణ లేకపోవటానికి మూలకారణమైన జనాభా పెరుగుదల సమస్యను పరిష్కరించడానికి మైనారిటీ వర్గాల మద్దతు అవసరమని ముఖ్యమంత్రి హిమంత స్పష్టం చేశారు.
పేదరికం సమస్యను సమర్థంగా పరిష్కరించడానికి వీలుగా సమాజంలోని మహిళలకు అవగాహన కల్పించే దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని శర్మ చెప్పారు. ఈ విషయంలో ముస్లింలకు నచ్చచెప్పేందుకు తాను ముస్లిం సంస్థలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఆలయం, సత్రా, అటవీ భూములను ఆక్రమణకు ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని తేల్చి చెప్పారు. జనాభా పెరుగుతూ ఉంటే నివసించడానికి భూమి సమస్య ఏర్పడుతుందని చెబుతూ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను దేవాలయ, అటవీ భూములలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని కోరుకోవడం తగదని స్పష్టం చేశారు.
“మీ సమస్యలను నేను అర్ధం చేసుకోగలను. జనాభా పెరుగుతూ ఉంటె నివాసం సమస్యగా ఏర్పడుతుంది, చిన్న కుటుంభం అలవాటు చేసుకోండి. గిరిజనులు చిన్న కుటుంబాలతో ఎన్నడూ అటవీ భూములను ఆక్రమించడం లేదు. పైగా, అటవీ భూములను పరిరక్షించడంతో పాటు, వాటి విస్తీర్ణం పెంచేందుకు దోహదం చేస్తున్నారు” అని ముఖ్యమంత్రి చెప్పారు.
హిమంత బిస్వా శర్మ ఇటీవల అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీనికన్నా ముందు ఆయన శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. విద్యా మంత్రిగా హిమంత శర్మ ఉన్న సమయంలో అసోంలోని మదర్సాలను మూసివేసే పెద్ద నిర్ణయం తీసుకున్నారు. హిందువులు నివసించే ప్రదేశాల్లో గొడ్డు మాంసం తినకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
More Stories
తెలంగాణకు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు హత్య బెదిరింపులు
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా