నకిలీ ఖాతాలతో పోలవరం నిర్వాసితుల సొమ్ము దోపిడీ

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని, నిర్వాసితులకు పరిహారం పేరుతో భారీగా సొమ్ములు దోచేస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన షెకావత్‌ని కలిసి ఈ అంశాలపై వినతిపత్రం అందించారు. 

నిర్వాసితులకు పునరావాస పరిహారం చెల్లింపు ముసుగులో నకిలీ ఖాతాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి భారీగా సొమ్ము కాజేస్తున్నారని ఆయన కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ‘‘రివర్స్‌ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు పనుల అంచనాలు పెంచేసి, 25 శాతం కమీషన్లు కొట్టేస్తున్నారు.  ప్రాజెక్టు నిర్మాణంకోసం కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రంలో దుర్వినియోగం అవుతున్నాయి” అని ఆరోపించారు. 

తక్షణమే సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో కోరారు. దాదాపు గంటపాటు సాగిన వీరి భేటీలో రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో పాల్పడుతున్న అవినీతి, అక్రమాలు; ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, రాజ్యాంగ, చట్ట, న్యాయస్థానాల ధిక్కారం తదితర అంశాలతో పాటు తనపై సీఐడీ పోలీసులు అక్రమంగా పెట్టిన రాజద్రోహం కేసు తదనంతర అంశాలన్నీ మంత్రి షెకావత్‌కు రఘురామరాజు వివరించినట్లు తెలుస్తున్నది. 

‘‘ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను, కుంభకోణాలను మీడియా ద్వారా బయటపెట్టి, ఎదిరిస్తున్నందుకే నాపై సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కక్షగట్టారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని నేను సీబీఐ కోర్టులో కేసు దాఖలు చేసానన్న కక్షతో  124-ఏ రాజద్రోహం సెక్షన్‌ పెట్టారు” అంటూ ఆరోపించారు. 

ఈ కేసులో అక్రమంగా అరెస్ట్‌ చేయించి, సీఐడీ పోలీసుతో దారుణంగా, రాక్షసంగా భౌతిక దాడులు చేయించారు. సీఐడీ కస్టడీలో తీవ్రంగా గాయపరిచారు. ఒక ఎంపీపై కక్షగట్టి ఇలా రాజద్రోహం కేసు పెట్టిన ఘటన దేశచరిత్రలో ఎన్నడూ జరగలేదని కేంద్రమంత్రికి వివరించారు. సీఐడీ కస్టడీలో తన పాదాలకు అయిన గాయాలను రఘురామ చూపించగా, షెకావత్‌ చలించిపోయినట్లు సమాచారం.