ఏపీలో మందకొండిగా టీకాలు … 5 శాతం మందికే!

ఆంధ్రప్రదేశ్ లో టీకాల కార్యక్రమం చాలా మందకొండిగా జరుగుతున్నది.  ఇప్పటివరకు కేవలం 5 శాతం మందికి మాత్రమే రెండు డోసులు వేశారు.  రాష్ట్రంలో సుమారుగా 5 కోట్ల మంది జనాభా ఉంటే ఇప్పటి వరకు 25,80,432 మందికి మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసినట్లు అధికారిక సమాచారం. 57,07,706 మందికి మొదటి డోసు టీకాను ఇచ్చారు. 

అంటే రాష్ట్ర జనాభాలో 11.41 శాతం మంది తొలి డోసు టీకాను వేసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి రెండో డోసు ఎప్పుడిస్తారన్న విషయంలో అధికార యంత్రాంగం లో స్పష్టత లేదు. ఈ ఏడాది జనవరి 16 నుంచి రాష్ట్రంలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. 

సుమారు ఐదు నెలలు కావస్తున్నా ఐదు శాతం మందికే పూర్తిస్థాయిలో టీకా వేయడానికి కారణం వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోవడమే. టీకాల కోసం  రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయిది. ఒక్క సంస్థ కూడా టెండర్లలో పాల్గనడానికి ముందుకు రాలేదు. 

తొలుత 60 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలు అందిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకూ వారికి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ సరఫరా చేయలేదు. ఇక 18 ఏళ్లు దాటిన వయోజనులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయం ఎప్పటికి ఆచరణలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. 

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారు సుమారు 3.25 కోట్లు మంది ఉంటారని అంచనా. వీరందరికీ రెండు డోసులు టీకా వేయాలంటే సుమారు 7 కోట్లు డోసులు అవసరమవుతాయి. మొత్తం మీద రాష్ట్ర అవసరాలు తీర్చడానికి 10 కోట్ల డోసులు అవసరమవుతాయని అంచనా. 

ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర ప్రజలందరికి వ్యాక్సిన్‌ వేయడానికి మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని, ఈ లోపు థర్డ్‌ వేవ్‌ వస్తే అడ్డుకునేదెలా అని వైద్య నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమం మందకొడిగా జరుగుతున్న మాట వాస్తవమేనని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు.

‘మన దగ్గర రోజుకు 6 లక్షల మందికి టీకా వేసే సామర్ధ్యం ఉంది. కానీ ఆ స్థాయిలో టీకాలు కేంద్రం నుంచి రావడం లేదు. ఏ రోజు వచ్చిన టీకాలు ఆ రోజే వేసేస్తున్నాం. ప్రతి రోజూ టీకాలు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా జనాభాను బట్టి కేంద్రం టీకాలను కేటాయిస్తే అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.’ అని ఆయన తెలిపారు.