సంఘ్ జేష్ఠ కార్యకర్త గొట్టిపాటి మురళీమోహన్ మృతి 

ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త గొట్టిపాటి మురళీమోహన్ (85) మంగళవారం మధ్యాహ్నం విజయవాడలో స్వర్గస్తులయ్యారు. ఆయన తండ్రి వెంకటేశ్వరరావు చౌదరి కూడా న్యాయవాదిగా సుప్రసిద్ధులు. హైస్కూల్ దశలో వారికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిచయమైంది. 

స్వర్గీయ భోగాది దుర్గాప్రసాద్ విజయవాడ విభాగ్ ప్రచారక్ గా పనిచేస్తున్న కాలంలో మురళీ మోహన్ సంఘ కార్యంలో ఉత్సాహంగా నిమగ్నమయ్యారు.  వారి అర్థాంగి శ్రీమతి స్వతంత్రభారతి వైద్యారోగ్య శాఖలో ఉన్నత పదవులలో పని చేశారు. వారికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారి పెద్ద కుమార్తె గత నెలలో గుండెపోటుతో మరణించారు. 

ముగ్గురు కుమార్తెలూ విదేశాలలో ఉన్నారు. వారి ఏకైక కుమారుడి వద్దనే ఉంటూ ఉండివారు.  ఆజన్మాంతము సంఘ కార్య విస్తరణలోనే తమ సంపూర్ణ శక్తిని వెచ్చించిన  మురళీమోహన్ ఆదర్శప్రాయుడు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ (యూనివర్సిటీ) సెనేట్ సభ్యులుగా పట్టభద్రుల తరఫున ఎన్నికైనారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యదర్శిగా చాలా సంవత్సరాలు బాధ్యత వహించారు. జాగృతి వారపత్రికను, సాహిత్యనికేతన్ పుస్తక విక్రయశాలను నిర్వహించే జాగృతి ప్రకాశన్ ట్రస్టులో దశాబ్దాలపాటు ట్రస్టీగా వ్యవహరించారు.

1977లో దివిసీమలో ఉప్పెన సంభవించగా, ఆ తర్వాత జరిగిన సేవాకార్యక్రమాలలో, 1986లో గోదావరి నదికి వరదలు వచ్చిన తర్వాత ప.గో జిల్లాలో జరిగిన వరద బాధితుల సహాయ కార్య క్రమాలలోనూ చురుకుగా పాల్గొన్నారు. 1980లో నాగాయలంకలో ఏర్పరచిన దీనదయాళ్ హాస్పిటల్ స్వంత భవన వసతి ఏర్పరచటంలో అనేక గ్రామాలకు స్వయంగా వెళ్లి విరాళాలు సేకరించి ఇచ్చారు. యాబై సంవత్సరాలకు పైబడిన వారి సమాజ సేవారంగ కార్యకలాపాలలో మచ్చుకు వీటిని పేర్కొనటం జరుగుతుంది.
1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమ సమయంలోను, 1974 జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని అవినీతి వ్యతిరేక ఉద్యమంలోనే క్రియాశీలంగా వ్యవహరించారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలోనూ ఆంతరంగిక భద్రతా చట్టం(మీసా) క్రింద జైలులో నిర్బంధింపబడి , హెబియస్ కార్పస్ పిటీషన్లు దాఖలుచేసి , కేసు వాదించుకొని విడుదల పొందారు.
 
1977లో లోకసభకు జరిగిన ఎన్నికలలో విజయవాడ నుండి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. 1970 తొలి సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విజయవాడ నగర కార్యవాహగా బాధ్యత స్వీకరించారు.1979 నుంచి కృష్ణా జిల్లా సంఘచాలక్ గా,1981 నుంచి విభాగ్ సంఘచాలక్ గా బాధ్యత వహించారు.
 
ఆపై 1991-93సంలలో పూర్వాంధ్ర ప్రాంత కార్యవాహగా బాధ్యత వహించారు. రా.స్వ.సంఘ సర్ సంఘచాలకులుగా విజయవాడ విచ్చేసిన సందర్భాలలో పూజనీయ శ్రీ గురూజీ, బాళాసాహెబ్ దేవరస్ ల వంటి పెద్దలకు ఆతిథ్యమిచ్చిన భాగ్యం వారికి లభించింది.
మురళీమోహన్ మరణం పట్ల భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తనకు ఎంతో సన్నిహితుడని ప్రధానంగా చాలా సౌమ్యులు, స్నేహశీలి అని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి పట్ల వారికి గల నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణ తో కూడిన జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని తెలిపారు.