ఆనందయ్య ముందుకు వైసిపి రంగు, నేతల ఫోటోలు!

కరోనా నివారణా ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఆనందయ్య మందును అందుకోడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు! ఉచితంగా తయారుచేసి పంచడానికి ఆనందయ్య సైతం తన సంసిద్ధతను ఇప్పటికే తెలిపారు. ‘ఆనందయ్య మందును అడ్డుకోవద్దు’ అని హైకోర్టు కూడా ఆదేశించింది. ‘హానికరం కాదు…పంచొచ్చు’ అని కోర్టుకు స్వయంగా ప్రభుత్వం తెలిపింది. 

అయినా అధికార పక్షం నేతలు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. స్వేచ్ఛగా మందు పంపిణీని అడ్డుకొంటున్నారు. అధికార యంత్రాంగం అసలు సహకరించడం లేదు. వైసిపి నేతలు పెద్ద ఎత్తున ఆ మందును తీసుకు వెడుతూ తమ పార్టీ రంగులు, తమ నేతల ఫోటోలు ఉన్న కవర్లలో, కేవలం అధికార పార్టీ ఎమ్యెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో పంపిణి చేసుకొంటున్నారు. 

ఇదంతా తమ మండే అన్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు. అసలు ఆనందయ్య మరుగున పడిపోతున్నారు. ఆనందయ్య కోరుకొన్నట్టు ఆయన మందు పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. మందు తయారీకి ప్రజల నుంచే కాదు.. ప్రభుత్వం నుంచీ ఆనందయ్య పైసా ఆశించడం లేదు. 

తయారుచేసిన తన మందు బాధితుల దాకా చేర్చడానికి పంపిణీలో సాయం అందించాలని మాత్రమే ఆయన కోరుతున్నారు. అందుకు కూడా ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు లేదు.  ‘‘ఉచితంగా మందు తయారుచేసిఇస్తా..తీసుకెళ్లి పంచుకోండి’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, డిజిపి గౌతమ్ సవాంగ్ లకు ఆనందయ్య ఆవేదనతో లేఖలు రాశారు.

‘ప్రతి జిల్లా పరిధిలో తొలి విడతగా ఐదు వేల యాక్టివ్‌ కేసులకు సరిపడా మందుల కిట్లు ఉచితంగా పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. కిట్లు స్వీకరించి బాధితులకు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకొంటే చాలు. ప్రభుత్వ యంత్రాంగమే మందుల పంపిణీ చేస్తుందని తొలుత ప్రకటించారు. కానీ, ఒక్కరూ నన్ను సంప్రదించలేదు. మందును అన్ని చోట్లా పంపిణీ చేసేంత యంత్రాంగం నాకు లేదు’’ అని ఆ లేఖలో ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆనందయ్య మందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చిన రెండు రోజుల తరువాత నెల్లూరు జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన మందుల పంపిణీకి సంబంధించి సమావేశం జరిగింది. ఆన్‌లైన్‌, యాప్‌, పోస్ట ల్‌.. ఇలా అన్ని మార్గాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని ఈ భేటీ అనంతరం కలెక్టర్‌ మీడియాకు తెలిపారు. 

జిల్లాల్లో మందుపంచే బాధ్యత కలెక్టర్లు తీసుకొంటారని కూడా చెప్పారు.  కానీ, నెల్లూరు సహా ఏ జిల్లా కలెక్టరూ.. తమ జిల్లాలకు మందు కావాలని ఇంతవరకు కోరలేదని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఆనందయ్య మందు అధికార నేతలకు తప్ప ప్రజలకు చిక్కకుండా చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యంగా కనిపిస్తున్నట్లు ప్రతిపక్షాలు  విమర్శిస్తున్నాయి.

ఆనందయ్య సొంత జిల్లా నెల్లూరులో తొమ్మిది వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రం మొత్తంపై లక్షకుపైగా కరోనా బాధితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. వీరందరికీ అత్యవసరంగా కే, ఎఫ్‌, ఎల్‌ మందు అందాలి. కే మందుకు తాజాగా హైకోర్టు అనుమతి కూడా లభించింది. 

అయినా.. ఈ మూడు మందులను వదిలేసి ‘పీ’ మందునే నేతలు ఆనందయ్యతో తయారుచేయిస్తున్నారు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచే సాధారణ మందు. కరోనాబారిన పడనివారు, వైరస్‌ బారిన పడి కోలుకొని మామూలు మనుషులు అయిన వారికి ఈ మందు వాడతారు. ఈ మందు అత్యవసరంగా వేసుకోవాల్సిన అవసరం లేదు. 

అయినా.. పట్టుబట్టి ఈ మందునే ఆనందయ్య, ఆయన కుమారునితో చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సర్వేపల్లిలో శాసనసభ్యుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి తయారుచేసి పంపిణీకి పెట్టారు. పార్టీ ప్రచారంగా అధికార పార్టీ ఎమ్యెల్యేల నియోజకవర్గాలలో పంపిణి కోసమే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.