ఎన్నికల సంస్కరణలు సత్వరం ఆమోదించండి!

ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణల ఆమోదానికి సత్వరమే చర్యలు చేపట్టాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  సరైనది కానటువంటి సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన వ్యక్తికి రెండేళ్ళ జైలు శిక్ష విధించేందుకు వీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఓ లేఖ రాశారు.

సీఈసీ సుశీల్ చంద్ర  ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు తాను గత నెలలో ఓ లేఖ రాసినట్లు తెలిపారు. ప్రతిపాదిత సంస్కరణలను ఆమోదించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనలను సత్వరమే చేపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ అఫిడవిట్లో సరైనది కానటువంటి సమాచారాన్ని సమర్పిస్తే, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధించేందుకు ప్రస్తుత చట్టాలు అనుమతిస్తున్నాయి. ఈ శిక్షా కాలాన్ని రెండేళ్ళకు పెంచాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. రెండేళ్ళు శిక్ష పడిన వ్యక్తి ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతారు.

చెల్లింపు వార్తలు (పెయిడ్ న్యూస్)ను ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల నేరంగా చేయాలని ఎన్నికల కమిషన్ ప్రతిపాదించింది. ఓటర్లు ప్రభావితం కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రచారానికి చివరి రోజు, పోలింగ్ రోజున వార్తాపత్రికల్లో రాజకీయ ప్రకటనలపై నిషేధం విధించాలని న్యాయ మంత్రికి రాసిన లేఖలో సుశీల్ చంద్ర ప్రతిపాదించారు. 

ప్రస్తుతానికి పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు ఎలక్ట్రానిక్ మీడియా మాత్రమే ఎన్నికల ప్రచార సామగ్రిని చూపకుండా నిరోధిస్తుని పేర్కొన్నారు. కానీ ప్రింట్ మీడియాను ప్ర‌జా ప్రాతినిధ్య చట్టం, 1951 లోని సెక్షన్ 126 పరిధిలోకి తీసుకురావాలని కమిటీ ఇప్పుడు సిఫారసు చేసింది.

ఓటర్లు ఇటువంటి ప్రకటనల ద్వారా ప్రభావితులు కాకుండా, స్వేచ్ఛాయుతమైన మనసుతో ఓట్లు వేయడానికి ఈ చర్య దోహదపడుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలను ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చేర్చవలసి ఉంది. 

ఈ నేపథ్యంలో సుశీల్ చంద్ర మాట్లాడుతూ, ఆరు నెలల జైలు శిక్ష విధించేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రస్తుత నిబంధన అభ్యర్థి అనర్హతకు దారి తీయడం లేదని పేర్కొన్నారు. ఒక ఓటరు అనేక చోట్ల ఓటును నమోదు చేసుకోవడాన్ని నిరోధించేందుకు ఓటర్ల జాబితాను ఆధార్ వ్యవస్థకు అనుసంధానం చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. 

ఇదిలావుండగా, . న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల లోక్‌స‌భలో ఒక స‌భ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఎన్నికల కమిషన్ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉన్న‌దని, దీనికి ఎన్నికల చట్టాల్లో సవరణ అవసరమని తెలిపారు. 

కాగా,  కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి అనూప్‌చంద్ర పాండే నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. అనూప్‌ చంద్ర 1984 బ్యాచ్‌ ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌ అధికారి. ఆయన నియామకంతో ఎన్నికల సంఘంలో పూర్తిస్థాయిలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. ప్రస్తుతం సుశీల్‌ చంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాగా, రాజీవ్‌కుమార్‌ మరో సభ్యుడిగా ఉన్నారు. అనూప్‌ చంద్ర గతంలో యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.