
తమ తమ లోక్‌సభ నియోజకవర్గాల్లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో చేపట్టిన ప్రజా సేవా కార్యక్రమాల వివరాలను తెలియజేయాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలందరికీ ఓ లేఖ రాశారు. కోవిడ్-19 వంటి తీవ్రమైన సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా నిలబడవలసిన బాధ్యత, కర్తవ్యం పార్లమెంటేరియన్లకు ఉందని ఈ లేఖలో ఓం బిర్లా గుర్తు చేశారు.
కోవిడ్-19 మహమ్మారి వంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైతే దీటుగా ఎదుర్కొనడానికి వీలుగా జాతీయ స్థాయిలో ఓ మంచి ప్రణాళికను రూపొందించడానికి వారి, వారి అనుభవాలు తెలుసుకోవడం కోసం ఈ లేఖలు వ్రాసారు.
ప్రజలు కష్టాల్లో ఉన్నపుడు వారికి సహాయపడేందుకు అధిక సమయాన్ని వెచ్చించి ఉంటారని తాను భావిస్తున్నానని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా వారి సమస్యల పరిష్కారానికి చేసిన కృషిలో ఎదురైన అనుభవాలను వివరించే సమయం ఆసన్నమైందని చెప్పారు.
దీనివల్ల ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎదురైతే ఏ విధంగా వ్యవహరించాలో జాతీయ స్థాయిలో ఉత్తమ విధానాలను రూపొందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
ఓం బిర్లా రాజస్థాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. తన నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను, కుటుంబంలో సంపాదించే సభ్యులను కోల్పోయినవారు ఇంజినీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే, వారికి తన నియోజకవర్గంలో ఉచిత శిక్షణ, వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు వివరించారు.
More Stories
దేశవ్యాప్తంగా రెండు దఫాల్లో జమిలి ఎన్నికల ప్రక్రియ
కూలిన విమాన నిర్వహణలో సంబంధం లేదన్న టర్కీ
ఇరాన్ పై దాడుల్లో ‘షాంఘై సహకార సంస్థ’కు భారత్ దూరం