ప్రధానితో మా బంధం బ్రేక‌వ్వ‌లేదు: థాకరే 

ప్రధానితో మా బంధం బ్రేక‌వ్వ‌లేదు: థాకరే 
“రాజ‌కీయంగా మేం ఒక‌టి కాక‌పోయినా.. మా మ‌ధ్య బంధం బ్రేక‌వ్వ‌లేదు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రధానిని కలసిన అనంతరం మాట్లాడుతూ “నేను నవాజ్ షరీఫ్‌ను కలుసుకుంటున్నానా? మన ప్రధానిని వ్యక్తిగతంగా కలుసుకుంటే అందులో తప్పేముంది?” అని థాకరే ప్రశ్నించారు.
 
ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిలిచిపోయిన మరాఠా రిజర్వేషన్ కోటా అంశాన్ని ఈ సమావేశంలో ఆయన లేవనెత్తారు. పది నిమిషాల సమయం కేటాయించాలని ప్రధానిని కోరిన థాకరే… తనతో పాటు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, మాజీ ముఖ్యమంత్రి చవాన్‌, తదితరులను తీసుకువెళ్లారు. ప్రధానితో జరిపిన సమావేశంలో మరాఠా రిజర్వేషన్ అంశాన్ని, తౌక్టే తుఫాను రిలీఫ్ అంశాలను తాను ప్రస్తావించినట్టు ఉద్ధవ్ థాకరే తెలిపారు. 

 ఇవాళ జ‌రిగిన భేటీలో మ‌రాఠా రిజ‌ర్వేష‌న్లు, మెట్రో కారు షెడ్‌, జీఎస్టీ ప‌న్ను వ‌సూళ్ల ప‌రిహరం గురించి ప్ర‌ధానితో చ‌ర్చించిన‌ట్లు సీఎం ఉద్ద‌వ్‌ తెలిపారు. మ‌రాఠా రిజ‌ర్వేష‌న్‌పై ఉన్న 50 శాతం సీలింగ్‌ను ఎత్తివేయాల‌ని ప్ర‌ధానిని కోరారు. మ‌రాఠా భాష‌కు ప్రాచీన హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో ఉంద‌ని సీఎం చెప్పారు. 

ఈ అంశాన్ని ప‌రిశీలిస్తామ‌ని ప్ర‌ధాని హామీ ఇచ్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాము ప్రస్తావించిన అంశాలను ఓపికగా విన్న ప్రధాని వాటిపై సానుకూలంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఉద్ధవ్ తెలిపారు.  

మ‌హారాష్ట్ర‌లో 18 నుంచి 44 ఏళ్ల గ్రూపులో ఆరు కోట్ల మంది ఉన్నార‌ని, వారికి రెండు సార్లు కోవిడ్ టీకాలు ఇవ్వాలంటే 12 కోట్ల డోసులు అవ‌స‌రం అవుతుంద‌ని ఉద్ద‌వ్ తెలిపారు. “అంద‌రికీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించాం, కానీ స‌రిప‌డా స‌ర‌ఫ‌రా లేక ఆగిపోయింది” అని ఆయ‌న చెప్పారు. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్‌ను కేంద్రీకృతం చేసిన ప్ర‌ధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త్వ‌ర‌లోనే భారత్ లో  ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సినేట్ అవుతార‌ని సీఎం ఉద్ద‌వ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.