అమరావతి ఎంపీ కుల ధ్రువీకరణ పత్రం రద్దు!

మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్‌ సభ్యురాలు, ప్రముఖ నటి నవనీత్‌ కౌర్‌ రాణా కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు రూ.2లక్షల జరిమానా విధిస్తూ బాంబే హైకోర్టు, నాగపూర్బెంచ్ మంగళవారం  తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీ పదవి ప్రమాదంలో పడింది. నవనీత్‌ కౌర్‌ నకిలీ పత్రాలతో ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం పొందారని శివసేన మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణ సందర్భంగా నవనీత్‌ కౌర్‌ కుల ధ్రువీకరణ పత్రం అబద్ధమని హైకోర్టు గుర్తించింది. ఈ మేరకు తీర్పునిచ్చిన ధర్మాసనం.. రూ.2లక్షల జరిమానా చెల్లించి, ఆరు వారాల్లోగా అన్ని ధ్రువపత్రాలను సమర్పించాలని ఆదేశించింది. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.

నవనీత్ నకిలీ సర్టిఫికెట్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిపించారని ఆనందరావు ఆరోపించారు. నవనీత్ 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇలా తప్పుడు కుల ధ్రువ పత్రాలతో జరిమానా పడ్డ మొట్టమొదటి ఎంపీ నవనీత్ కౌర్ కావడం గామనార్హం.

నవనీత్ కౌర్ (35) ఏడు భాషలు మాట్లాడగలరు. మార్చిలో ఆమె మాట్లాడుతూ, శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్‌సభ లాబీలో బెదిరించారని ఆమె ఆరోపించారు.  మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తాను జైలుపాలవుతానని ఆయన అన్నారని చెప్పారు. మరోవైపు ఆమె లోక్‌సభ సభాపతి ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు. తనకు ఫోన్ కాల్స్, శివసేన లెటర్ హెడ్స్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయని, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు.

ఎన్‌సీపీ తరఫున పోటీ చేయగా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా శివసేన అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు. నవనీత్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా భార్య. కన్నడ చిత్రం ‘దర్శన్ ’చిత్రంతో నవనీత్ సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మితో పాటు పలు చిత్రాల్లో నటించారు.

కాగా, భారత దేశ పౌరురాలిగా తాను న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నానని నవనీత్ కౌర్ తెలిపారు. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం ఉందని పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆమె తల్లిదండ్రులు పంజాబ్ మూలాలు కలవారని, వారి కులం ఆ రాష్ట్రంలో ఎస్సీ క్రిందకు వస్తుందని, మహారాష్ట్రలో ఎస్సీ పరిధిలోకి రాదని తెలుస్తోంది. నవనీత్ కౌర్ 1986 జనవరి 3న ముంబైలో జన్మించారు.