జులైలో పార్లమెంట్ స్థాయి సంఘ సమావేశాలు

పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలు జూలై నుంచి నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్యసభ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకులు వర్చువల్‌ సమావేశాలు నిర్వహించాలని చేసిన విజ్ఞప్తిని ఇటీవల రాజ్యసభ చైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌ తిరస్కరించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఇప్పటి వరకు కమిటీలు సమావేశాలు నిర్వహించలేదు. 

పార్లమెంట్‌ సభ్యులు, సీనియర్‌ అధికారులు, సహాయక సిబ్బందికి టీకాలు వేయడం, యాక్టివ్‌ కేసులు తగ్గుతుండడంతో జూలై నుంచి తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు గోప్యంగా జరగాల్సి ఉందని నిబంధనలు ఉన్నాయని, వర్చువల్‌ విధానంలో నిర్వహిస్తే కమిటీ కార్యకలాపాలు బయటకు పొక్కే అవకాశం ఉండడంతో ఉభయ సభలు తిరస్కరించాయి.

సమావేశాల నిర్వహణపై ఓ సీనియర్‌ మంత్రిని సంప్రదించగా  ‘వర్చువల్‌ సమావేశాలు ఉండకూడదు. ఇవి గోప్యంగా జరిగే సమావేశాలు. చాలా వరకు దేశ భద్రతకు సంబంధించినవి’ అని పేర్కొన్నారు. గోప్యత, సున్నితమైనవి కావడంతో వర్చువల్‌ సమావేశాలు సాధ్యం కావని ఇప్పటికే సభ్యులు తెలియజేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

కొవిడ్‌ మహమ్మారి తగ్గే వరకు సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని తెలిపాయి. ఇదిలా ఉండగా పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశాలను నిర్వహించాలని కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జై రామ్‌ రమేశ్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రధాని మోదీని డిమాండ్‌ చేశారు. కమిటీల సమావేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు అంగీకరించి, డిజిటల్‌ ఇండియాను నిజం చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు.

 మరోవంకపరిస్థితులు అనుకూలంగా ఉంటే షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో యధావిధిగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి త్వరలో జరగాల్సిన పార్లమెంటు సమావేశాలపై స్పందించారు. 
 
కరోనా కల్లోలం కారణంగా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు పార్లమెంటు సమావేశాలను కుదించగా… శీతాకాల సమావేశాలు పూర్తిగా రద్దయ్యాయి. సాధారణంగా ప్రతి ఏడాది జూలైలో ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయి. 
 
కాగా ఈ సారి వర్షాకాల సమావేశాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇప్పటికీ చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ‘‘సాధారణ షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభవుతాయని ఆశిస్తున్నాం…’’ అని జోషి పేర్కొన్నారు. ఉభయ సభల్లోని పార్లమెంట్ సభ్యులు, సిబ్బంది, ఇతర సిబ్బంది కనీసం ఒక్క డోస్ అయినా టీకా వేయించుకుంటే.. వచ్చే నెల నుంచి పార్లమెంటు సమావేశాలకు ఇబ్బంది ఉండడబడోదని అధికారులు భావిస్తున్నారు.