కేరళ బిజెపి అద్యక్షుడు సురేంద్రన్ పై కేసు!

కేరళ బిజెపి అద్యక్షుడు సురేంద్రన్ పై కేసు!
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఒక సీట్ కూడా గెల్చుకోలేదు. అయినా అధికార పక్షం ఎల్డిఎఫ్ బిజెపి నేతలను వెంటాడుతున్నది. ఇప్పటికే ఎన్నికల అనంతరం బయటపడిన హవాలా డబ్బు దోపిడీ వ్యవహారంపైనా కేసు నమోదు చేసి, బిజెపి నేతలను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్న కేరళ పోలీసులు, తాజాగా కేరళ బిజెపి అధ్యక్షుడు కె సురేంద్రన్ పైననే కేసు నమోదు చేశారు. 
 
సురేంద్రన్‌ మంజేశ్వర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే అచ్చం ఆయన పేరునే పోలిన బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన సురేంద్ర తన ప్రమాణ పత్రాలను ఉపసంహరించుకుని, బీజేపీకి మద్దతు ప్రకటించాడు. అయితే ఇప్పుడు తీరికగా భయపెట్టి, ప్రలోభానికి గురిచేసి నామినేషన్ ఉపసంహరించు కొనేటట్టు చేశారని అంటూ కేసు నమోదు చేశారు.
 
తాను పోటీ నుంచి తప్పుకున్నందుకు బీజేపీ తనకు రూ.2.5 లక్షలు, ఓ మొబైల్‌ ఫోన్‌ ఇచ్చిందని సురేంద్ర ఇప్పుడు ప్రకటించాడు. దీంతో అదే నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన వీవీ రమేశన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోర్టు అనుమతితో కే. సురేంద్రన్‌పై పోలీసులు కేసు నమోదుచేశారు. సురేంద్ర ప్రకటనపై ప్రాధమిక దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.

కాగా, 2016లో జరిగిన ఎన్నికల్లో మంజేశ్వర్‌ నుంచి సురేంద్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. ఈ ఎన్నికల్లో కే. సురేంద్రన్‌ కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అప్పుడు సురేంద్రకు 467 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికలలో ముస్లిం లీగ్ అభ్యర్థిపై 1143 ఓట్ల తేడాతో సురేంద్రన్ ఓటమి చెందారు. 

‘పోలీసులను దర్యాప్తు చేయనీయండి. నేను ఏమీ చేయకుండా ఇప్పటికే నాపై సుమారు 300 కేసులు నమోదు చేశారు. ప్రభుతం ఈ విధంగా చేసిందని నేను అనుకొంటూనే ఉన్నాను” అని సురేంద్రన్ వ్యాఖ్యానించారు.