లోక్‌పాల్‌కు 110 అవినీతి ఫిర్యాదులు

లోక్‌పాల్‌కు 110 అవినీతి ఫిర్యాదులు అందాయి. వాటిల్లో నాలుగు పార్లమెంట్‌ సభ్యులకు వ్యతిరేకంగా వచ్చినవే. 2019-20తో పోలిస్తే 2020-21లో వచ్చిన ఫిర్యాదులు 92 శాతానికి పైగా తగ్గాయని తాజా అధికార డేటా తెలియచేసింది. 

2019-20లో లోక్‌పాల్‌కు 1,427 అవినీతి ఫిర్యాదులు అందాయి. గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 57 ఫిర్యాదులు గ్రూపు ఎ లేదా గ్రూపు బి కేంద్ర ప్రభుత్వ అధికారులపై వచ్చాయి. 

వివిధ బోర్డుల, కార్పొరేషన్ల, స్వయం ప్రతిపత్తి సంస్థల (కేంద్రం పూర్తిగా లేదా పాక్షికంగా ఆర్థిక సాయం అందించే) ఛైర్‌పర్సన్‌లు లేదా సభ్యులు, లేదా ఉద్యోగులపై 44 ఫిర్యాదులు వచ్చాయి ‘ఇతరుల కేటగిరీ’లో ఐదు ఫిర్యాదులు అందాయని ఆ డేటా పేర్కొంది.

లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ 2019 మార్చి 23న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానితో సహా ప్రభుత్వ రంగ సిబ్బంది, కార్యకర్తలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై లోక్‌పాల్‌ దర్యాప్తు జరుపుతుంది. 30 ఫిర్యాదులపై ప్రాధమిక విచారణకు లోక్‌పాల్‌ ఆదేశాలు జారీ చేసింది. 

ప్రాధమిక పరిశీలన ముగిసిన తర్వాత 75 కేసులను ముగించిందని డేటా తెలిపింది. 2020-21లో ప్రాధమిక దర్యాప్తు నివేదికను పరిశీలించిన తర్వాత 13ఫిర్యాదులను మూసివేసిందని డేటా తెలిపింది. గ్రూపు ఎ లేదా బి అధికారులపై ప్రాధమిక విచారణ కోసం దాదాపు 14 ఫిర్యాదులు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ వద్ద పెండింగ్‌లో వున్నాయి. మరో మూడు సిబిఐ వద్ద పెండింగ్‌లో వున్నాయని లోక్‌పాల్‌ డేటా తెలిపింది.