వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రానిదే 

వ్యాక్సినేషన్ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రాష్టాలు వ్యాక్సిన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేంద్రమే వ్యాక్సిన్లు కొని రాష్ట్రాలకు ఇస్తుందని వెల్లడించారు. అన్ని వ‌ర్గాల‌కు ఉచితంగా టీకాలు వేసే బాధ్య‌త కేంద్రానిదేన‌ని కూడా తెలిపారు. 

కోవిడ్ సెకెండ్ వేవ్ నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ లభ్యత, స్వదేశీ వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కీలక విషయాలపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ ప్రస్తుతం 25 శాతం వ్యాక్సినేషన్ వర్క్ రాష్ట్రాలు చేస్తున్నప్పటికీ, ఇప్పుడు కేంద్రమే ఆ బాధ్యత కూడా తీసుకుంటుందని ప్రకటించారు. రాబోయే రెండు వారాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు.

జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని వెల్లడించారు. కేంద్రం పరిధిలోనే ఇక పూర్తిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగనుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు, ప్రైవేటు దవాఖానల్లో ఈ టీకా వేసుకోవచ్చని అంటూ . ప్రైవేటులో వేసుకునేవారు రూ. 150 సర్వీసు చార్జి చెల్లించాల్సి ఉంటుందని మోదీ తెలిపారు. తాము 25 శాతం వ్యాక్సిన్ల‌ను ప్రైవేట్ ద‌వాఖాన‌ల‌కు అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు. 

స్వదేశీ వ్యాక్సిన్లతో ప్రపంచానికి దేశ శక్తి ఏంటో చూపగలిగామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.  ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలు తక్కువే ఉన్నాయని, వారి అవసరాలు తీరాక టీకాలు దేశానికి రావడానికి ఏళ్లు పట్టేదని మోదీ గుర్తు చేశారు. వ్యాక్సిన్ త‌యారీలో ప్ర‌పంచ దేశాల‌తో మ‌నం పోటీ ప‌డ్డామని తెలుపుతూ త‌క్కువ స‌మ‌యంలో వ్యాక్సిన్లు త‌యారు చేయ‌డంలో శాస్త్ర‌వేత్త‌లు విజయం సాధించారని ప్రధాని  ప్ర‌శంసించారు. మ‌న శాస్త్ర‌వేత్త‌ల‌పై త‌మ‌కు సంపూర్ణ విశ్వాసం ఉంద‌ని చెప్పారు.

గత  వందేళ్లలో ఘోరమైన విషాదమిదేనని అంటూ ఆధునిక కాలంలో ఇటువంటి మహమ్మారి ఎదురు కాలేదని ప్రధాని చెప్పారు. ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్‌తో భార‌త్ క‌ఠినంగా పోరాడుతున్న‌ద‌ని తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం ఆరోగ్య రంగంలో మౌలిక వ‌స‌తుల‌ను పెంచామ‌ని వెల్ల‌డించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రజలు అనేక బాధలు అనుభవించారని పేర్కొంటూ  ఇంత మెడికల్ ఆక్సిజన్ అవసరం ఎప్పుడూ రాలేదని తెలిపారు.  ఇప్పుడు మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లకు మించి పెంచినట్లు మోదీ వెల్లడించారు. 

ఆర్మీ నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేలను ఉపయోగించి ఆక్సిజన్ కొరతను తీర్చామని కొనియాడారు. ప్రస్తుతం దేశంలో ఆరు కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయని, మరో మూడు కంపెనీలు  ఉత్పత్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పిల్లలపైన టీకా ప్రయోగాలు జరుగుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లపై ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని దీపావళి వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని  ప్రకటించారు. ఈ పథకం వల్ల 80 కోట్ల మంది పేదలు ఉచిత రేషన్ అందుకుంటారని ప్రధాని పేర్కొన్నారు. గత ఏడాది కూడా కోవిడ్ సమయంలో కొన్ని నెలల పాటు ఈ స్కీమ్‌ను కేంద్రం అమలు చేసిందని గుర్తు చేశారు. మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో పేదలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.