వయోజనులందరికి డిసెంబర్ నాటికి టీకాలు 

దేశంలోని వయోజనులందరికి డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే దిశలో రంగం సిద్ధం అయింది. వివిధ మార్గాల ద్వారా మొత్తం 187 కోట్ల డోస్‌లను సమీకరించుకోవడం జరుగుతుంది. దీనితో టీకాలకు అన్ని విధాలుగా అర్హత పొందిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్లు పడేందుకు వీలేర్పడుతుందని ఉన్నతాధికారుల స్థాయిలో సమాచారం వెలుగులోకి వచ్చింది. 

టీకాల కొరతను అధిగమించేందుకు అందరికీ టీకాల దిశలో ముందుకు సాగేందుకు ఇప్పటికే మోదీ ప్రభుత్వం  స్వదేశీ, విదేశీ టీకాల సమీకరణను వేగవంతం చేసింది. అత్యధిక స్థాయిలో వ్యాక్సిన్ల ఉత్పత్తికి, సేకరణకు, వాటి పంపిణీకి సరైన రీతిలో చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి జులై మధ్యకాలంలో భారత్ లో  మొత్తం 53.6 కోట్ల డోసులు వేయడం జరుగుతుంది.

ఇక ఆగస్టు డిసెంబర్ మధ్యకాలంలో ఈ డోసుల మొత్తం 133.6 కోట్లు స్థాయికి చేరుతుంది. వీటితో డిసెంబర్ నాటికే దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు అందుతాయని అంచనా వేశారు. మరిన్ని సంస్థలు వ్యాక్సిన్‌ల సరఫరా గొలుసు క్రమంలో చేరుతాయి. ఇప్పటికే వ్యాక్సిన్ల తయారీలో ఉన్న కంపెనీలు ఉత్పత్తి కోటాను పెంచుకుంటాయని అధికార యంత్రాంగం భావిస్తోంది.

ఫైజర్, మాడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కొత్త టీకాలు వస్తున్నాయి. రష్యాకు చెందిన స్ఫుత్నిక్ టీకా అందుబాటులోకి వచ్చింది. దేశంలో దీని ఉత్పత్తికి రెండు కంపెనీలకు అనుమతి దక్కింది. అమెరికా నుంచి వచ్చే టీకాల సేకరణకు సంబంధించి భారత ప్రభుత్వం తగు విధంగా డీల్ కుదుర్చుకుంటుంది. దీనితో డిమాండ్‌ను మించి సరఫరాకు వీలేర్పడుతుంది.

మరో వైపు దేశీయ టీకాలు మరిన్ని తయారీ కీలక దశలోకి చేరుతున్నాయి. దేశంలో 18 పైబడ్డ వారందరికి ఉచిత టీకాలు కేంద్రం అందిస్తుందని ప్రధాని సోమవారమే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు దీని గురించి ఇందుకు అవసరం అయిన టీకా వనరుల సేకరణ గురించి స్పష్ట నిర్థిష్ట సంకేతాలు వెలువరించారు.

మే నెలలో వ్యాక్సినేషన్లపై రాష్ట్రాలు అస్పష్ట అంతకు మించి పరస్పర వైరుద్ధ వైఖరిని ప్రదర్శించడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. వ్యాక్సిన్ల అందుబాటు గురించి రాష్ట్రాలకు కేంద్రం ముందుగానే తెలియచేస్తుందని, దీనికి సంబంధించి అత్యంత అనువైన సమర్థతను త్వరలో సంతరించుకుంటామని కేంద్ర ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

కాగా, కొవిడ్ తరువాతి దశలో పిల్లలకు ఎక్కువగా ముప్పు ఉందనే వాదనకు సరైన శాస్త్రీయ ప్రాతిపదిక ఏదీ లేదని, పరిస్థితులను బట్టి ఇతరుల లాగానే పిల్లలకు కూడా వైరస్ సోకే ముప్పు ఉండనే ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే పిల్లల భద్రతపై ఎటువంటి రాజీ లేకుండా వారికి కూడా వ్యాక్సినేషన్ల దిశలో చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

అతి తక్కువ సమయంలో దేశంలోని వయోజనులందరికి వ్యాక్సినేషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. డోస్‌కు రూ 150 సేవారుసుం పరిమితిపై ప్రైవేటు ఆసుపత్రులు సంతోషంగా లేవనే వాదనపై ఉన్నతాధికారి స్పందించారు. అతి ఎక్కువ పరిణామంలో డోసులు అందుకుంటారు కాబట్టి అత్యధిక ఆసుపత్రులు ఈ రేటును సముచితంగానే భావిస్తున్నాయని ఆ అధికారి తేల్చిచెప్పారు.