దేశంలో 24 కోట్లకు పైగా టీకా డోసులు

కోవిడ్ పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారి ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించడం, టీకాలివ్వటం వంటి ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది. 

భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తున్నది. అంతే కాకుండా ఉత్పత్తి, సరఫరాను పెంచటానికి అనేక చర్యలు తీసుకుంతున్నది.

మే 1న నుంచి మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ (సిడిఎల్) ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన 50శాతం టీకా మందును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలు మిగిలిన 50శాతం కొనుగోలు చేసుకోవచ్చు.

 ప్రభుత్వం అందించే టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది. భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 24 కోట్లకు పైగా (24,60,80,900) కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర ఇంకా 1.49 కోట్లకు పైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయి.

కాగా, ఢిల్లీ, హర్యానా సహా 7 రాష్ట్రాల్లో 1,000 కంటే తక్కువ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సోమవారం  తెలిపారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఝార్ఖాండ్ కూడా ఈ జాబితాలో ఉన్నాయని చెప్పారు. 
 
దేశంలోని కోవిడ్ పరిస్థితిపై మంత్రుల గ్రూపును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం 14,01,609 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, కరోనా రికవరీ రేటు నిలకడగా పెరుగుతోందని చెప్పారు. సుమారు 83 శాతం యాక్టివ్ కేసులు 10 రాష్ట్రాల్లో ఉండగా, తక్కిన 17 శాతం ఇతర రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిపారు. 
 
జమ్మూకశ్మీర్, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు 2,000 కంటే తక్కువగా నమోదవుతున్నట్టు హర్షవర్ధ్ తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు ఆయన వివరించారు.