దేశంలో లక్షకు దిగివచ్చిన కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసులు లక్షకు దిగివచ్చాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,89,09,975కు చేరింది. ఇందులో 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకోగా, 14,01,609 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. 

కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 2427 మంది మృతి చెందారు, కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 23,27,86,482 మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించారు.

ఇక దేశంలో కరోనా కేసులు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 36,63,34,111 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 15,87,589 మందికి పరీక్షలు చేశామని తెలిపింది.

కాగా, దేశంలో కరోనావైరస్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా కొన్ని రాష్ట్రాల్లో కేసుల క్షీణతలో నెమ్మదిత‌నం క‌నిపిస్తోంది. దక్షిణ భారతదేశంలో కరోనా కేసులు చాలా నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని ఒక నివేదికలో వెల్ల‌డ‌య్యింది. ద‌క్షిణాదితో పోలిస్తే ఉత్త‌రాదిన రెండు రెట్ల వేగంతో కోవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. 

మే 9 న దేశంలో గరిష్ట స్థాయికి చేరుకున్న కేసులు త‌రువాతి కాలంలో హర్యానాలో సగటున 8.9 శాతం, రాజస్థాన్‌లో 8.5 శాతం, ఢిల్లీలో 8.2 శాతం, ఉత్తర‌ప్రదేశ్‌లో 7.8 శాతం చొప్పున త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని ఆ నివేదిక పేర్కొంది. 

అదే సమయంలో మహారాష్ట్ర, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కేసుల క్షీణత రేటు చూస్తే త‌మిళ‌నాడులో 2.7 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో4.2 శాతం చొప్పున త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఉత్తర భారతదేశంలో కేసుల క్షీణత రేటు దక్షిణాది కంటే రెండింతలు అధిక‌మ‌ని డేటా ద్వారా తెలుస్తోంది. మ‌రోవైపు దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల రిపోర్టింగ్ విధానంలో వ్యత్యాసం ఉందని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.