మతం మారితే.. రిజర్వేషన్‌ వర్తించదు!

ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది, ఆ తర్వాత మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భారతీయార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ఇటీవల ఈ ఆదేశాలు జారీ చేశారు. 

‘‘ఒక ఉద్యోగి నిర్దిష్టంగా ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది, ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలి. వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదు. అలాగే, అపాయింట్‌మెంట్‌కు ముందు మతం మారిన వారికి కూడా సంబంధిత కులం కోటా వర్తించదు’’ అని తెలిపారు. 

తప్పుడు సమాచారం అందించి ఉద్యోగం పొందిన, అనర్హులను ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాల కమిటీలపైనా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. తగిన అర్హతలు లేని వ్యక్తిని భారతీయార్‌ విశ్వవిద్యాలయంలో లైబ్రరీ అసిస్టెంట్‌గా నియమించడంతోపాటు, వెంటనే పదోన్నతి కల్పించారని పేర్కొంటూ ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 

సదరు ఉద్యోగికి సంబంధించిన విద్యార్హతలు ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయానికి అందజేయకపోవడం పట్ల న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు నియామకాలు చేపట్టిన సమయంలో అభ్యర్థుల వివరాలు, విద్యార్హతలు తదితరాల గురించి ఆయా సంస్థల వెబ్‌సైట్లలో నమోదు చేయాలని, అభ్యర్థుల ఇంటర్వ్యూ ప్రక్రియ వీడియో ద్వారా రికార్డ్‌ చేయాలని స్పష్టం చేశారు. 

ఉద్యోగం పొందిన వారు అక్రమ మార్గంలో నియమితులైనట్లు తేలితే వెంటనే వారి నియామకాన్ని రద్దు చేయాలని, వారికి చెల్లించిన వేతనాన్ని నియామక కమిటీ సభ్యుల నుంచి వసూలు చేయాలని తేల్చి చెప్పారు.

హిందువులలో భాగమైన దళితులు లేదా గిరిజనులు మతం మారి క్రైస్తవం స్వీకరిస్తే ‘ఎస్సీ/ఎస్టీ’ హోదా కోల్పోతారు. వారిని  క్రైస్తవులుగానే పరిగణించాలి. మన రాష్ట్రంలో క్రైస్తవులు ‘బీసీ-సీ’ కేటగిరీలోకి వస్తారు. ఇలాంటి వారికి ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదు. 

తాను ఉద్యోగంలో చేరినప్పుడు ఎస్సీగానే ఉన్నానని, ఆ తర్వాత మతం మారాననే వాదన కూడా చెల్లదని మద్రాస్‌ హైకోర్టు ఇప్పుడు తీర్పు చెప్పింది. ఉద్యోగం వచ్చిన తర్వాత మతం మారినప్పటికీ, కోటా వర్తించదని స్పష్టం చేసింది. 

హిందూ మతంలో ఉండి వివక్ష ఎదుర్కొన్న వెనుకబడిన, అణగారిన కులాలకు చెందిన వారి ఉన్నతి కోసం రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల ఆధారంగా తరాలపాటు వివక్ష ఎదుర్కొన్న వారికి రాజ్యాంగం ఇచ్చిన వరం ఇది. అసమానతలను పోగొట్టడమే లక్ష్యం. 

అందువల్ల, మతం మారితే కులం పోతుందని, ఆ కులం ఆధారంగా వచ్చే రిజర్వేషన్‌ కూడా వర్తించదని నిబంధన విధించారు. దేశంలో రిజర్వేషన్లతోపాటే ఈ నిబంధన  వచ్చింది. 

అయితే, అత్యధికులు మతం మార్చుకున్నప్పటికీ, అధికారికంగా హిందువులుగానే కొనసాగుతూ రిజర్వేషన్‌ ఫలాలు అనుభవిస్తున్నారని సొంత మతంలో కొనసాగుతున్న ఎస్సీలు ఆరోపిస్తున్నారు. హిందూ మతంలోనే ఉంటున్న తమకు దీనివల్ల నష్టం జరుగుతోందంటుని చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.