ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి ఇస్రో సహకారం

ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సహాయపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  చెప్పారు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఇతర స్పేస్ టెక్నాలజీని అత్యుత్తమంగా ఉపయోగించుకోవడంలో సహకరిస్తుందని పేర్కొన్నారు. 

ఆయన అధ్యక్షతన జరిగిన ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. ఈశాన్య ప్రాంతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో సిక్కిం, అస్సాం మినహా మిగిలిన రాష్ట్రాలు ఇస్రో ద్వారా జరగవలసిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను పంపించాయని చెప్పారు.

సిక్కిం, అస్సాం కూడా త్వరలోనే తమ ప్రతిపాదనలను పంపిస్తాయని తెలిపారు. ఈ ఎనిమిది రాష్ట్రాల్లోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇస్రో సహకరిస్తుందని తెలిపారు. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్పేస్ టెక్నాలజీ వంటివాటిని సమగ్రంగా ఉపయోగించడం ద్వారా ఈ సహకారాన్ని అందజేస్తుందని వివరించారు.

ఈ ఎనిమిది రాష్ట్రాల్లోని 221 ప్రదేశాల్లో 67 ప్రాజెక్టులను ఇస్రో పర్యవేక్షించడంతోపాటు జియో ట్యాగింగ్ చేసిందని తెలిపారు.  అభివృద్ధి పథకాల్లో ఇస్రో సంస్థాగతంగా పాలు పంచుకోవడం మన దేశంలో ఇదే మొదటిసారి అని, ఈ విధానం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పరిపాలనలో ఇస్రో తన పరిధిని విస్తరించుకుంటోందన్నారు. ఇస్రో కేవలం ఉపగ్రహాలను ప్రయోగించడానికే పరిమితం కాకుండా, అభివృద్ధి కార్యకలాపాల్లో తన పాత్రను పెంచుకుంటోందని చెప్పారు. మోదీ కలలు కంటున్న ‘‘మారుతున్న భారత దేశం’’ను సాధించేందుకు కృషి చేస్తోందన్నారు.