కాంగ్రెస్ వారసత్వం, గత చరిత్రపై ఆధారపడరాదు 

కాంగ్రెస్‌కు భారీ శస్త్ర చికిత్స అవసరమని, కేవలం వారసత్వం, గత చరిత్రపై ఆధారపడకూడదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎం వీరప్ప మొయిలీ కాంగ్రెస్ అధిష్టానంపై మరోసారి తన అసంతృప్తి గళం వినిపించారు. బాధ్యతలను అప్పగించేటపుడు సైద్ధాంతిక నిబద్ధతగల నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని హితవు చెప్పారు. 

తాజాగా ఉత్తర ప్రదేశ్ నేత జితిన్ ప్రసాద ఆ పార్టీని వీడి, బీజేపీలో చేరిన నేపథ్యంలో మొయిలీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ జితిన్ సైద్ధాంతిక నిబద్ధత మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉండేదని స్పష్టం చేశారు. అటువంటి వ్యక్తులనే కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తూ వస్తున్నదని పరోక్షంగా కాంగ్రెస్ అధినాయకతంపై విరుచుకు పడ్డారు. 

పార్టీలోని నేతల సమర్థతను సరైన రీతిలో అధిష్ఠానం మదింపు చేయాలని స్పష్టం చేశారు. అర్హత లేనివారిని నాయకులుగా తయారు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తన వ్యూహాలను పునరాలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సమర్థులు కానివారికి పదవులు ఇవ్వవద్దని, పార్టీని సరైన విధంగా పునర్వ్యవస్థీకరించాలని కోరారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆత్మావలోకనం చేసుకోవాలని, ఇది పార్టీకి ఓ గుణపాఠమని మెయిలీ హితవు చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం కూడా  కాంగ్రెస్ పోటీలో నిలవాలంటే భారీ శస్త్ర చికిత్స అవసరని ఆయన పేర్కొనడం గమనార్హం. తిరిగి ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. 

శస్త్ర చికిత్స చాలా ఆలస్యమైందని, ఇది ఇప్పటికిప్పుడే అవసరమని, రేపటికి వాయిదా వేయకూడదని పార్టీ నాయకత్వాన్ని వారించారు.  వచ్చే ఏడాదిలో ఏడు రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరుగుతాయని, ఆ వెంటనే 2024లో పార్లమెంటు ఎన్నికలు వస్తాయని గుర్తు చేశారు. 

ఈ ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సరైన స్థితిలో లేకపోతే, లోక్‌సభ ఎన్నికల్లో మరింత కష్టమవుతుందని మెయిలీ హెచ్చరించారు. కాంగ్రెస్ కేవలం వారసత్వంపై ఆధారపడకూడదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పోటా పోటీ రాజకీయాలకు తగినట్లుగా మనల్ని మనం మలచుకోవాలని పిలుపునిచ్చారు. 

మోదీని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదనేదేమీ లేదని అంటూ కాంగ్రెస్‌ను గాడిలో పెడితే మోదీని ఓడించవచ్చని సూచించారు.  ఇప్పటికిప్పుడే కాంగ్రెస్‌కు మేజర్ సర్జరీ అవసరమని పేర్కొన్నారు. దీనిని రేపటికి వాయిదా వేయకూడదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని చెబుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో జితిన్ ప్రసాద, వీరప్ప మొయిలీ కూడా ఉన్నారు.