ఏ వ్యక్తివల్లో, పదవికోసమో కాంగ్రెస్‌ను వీడలేదు

ఏ వ్యక్తి కారణంగా కానీ, ఏ పదవిని ఆశించి కానీ తాను కాంగ్రెస్ పార్టీని వీడలేదని, ఉత్తరప్రదేశ్ ప్రజలకు పార్టీకి మధ్య దూరం పెరుగుతున్న కారణంగానే ఆ పార్టీని వీడానని బీజేపీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద స్పష్టం చేశారు. 

`పార్టీకి, ప్రజలకు మధ్య దూరం పెరిగిపోతున్న కారణంగానే పార్టీని వీడాను. ఈ కారణంగానే యుపిలో ఆ పార్టీ ఓట్ల శాతం తగ్గిపోతోంది. పార్టీని బలోపేతం చేసే ఆలోచన కూడా కాంగ్రెస్‌కు లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. 

అందుకే ఎన్నో చర్చలు, సంప్రదింపుల అనంతరం బిజెపిలో చేరాలని నిర్ణయించుకున్నానని కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్‌లో ఉంటే తాను తన ప్రజల ప్రయోజనాలను కాపాడలేనని ప్రసాద స్పష్టం చేశారు. అంతేకాదు, దేశంలో బిజెపి ఒక్కటే సంస్థాగతమైన జాతీయ పార్టీ అని కూడా ఆయప స్పష్టం చేశారు.

దేశ ప్ర‌యోజ‌నాల కోసం బీజేపీ పాటుప‌డుతోంద‌ని చెబుతూ కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయంగా క్షీణ‌స్థితికి చేరుతోంద‌ని రెండు  సార్లు ఆ పార్టీ ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన జితిన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కోలుకుంటుంద‌నే ఆశ త‌న‌లో లేద‌ని ఆయన తెలుపుతూ తాను బీజేపీలో చేరాల‌ని రాత్రికి రాత్రి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స్పష్టం చేశారు. 
యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ లో ప్రస్థానం ప్రారంభించిన ఆయన రాజీవ్ గాంధీ, పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానులుగా ఉన్న స‌మ‌యంలో జితేంద్ర ప్ర‌సాద వారికి రాజ‌కీయ స‌ల‌హాదారుగా ఉన్నారు.